జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో సంగారెడ్డి బతుకమ్మ సంబరాలు
ఆరు వేదికలపై ఆటపాటలు.. విద్యుద్దీపాలతో కాంతులీనిన కింది బజార్ చెరువు కట్ట
అలరించిన కళాకారుల ఆటపాటలు, ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన ఫోక్ సింగర్ కనకవ్వ పాటలు
బతుకమ్మ ఆడి సందడి చేసిన జయా రెడ్డి , నిర్మలా జగ్గారెడ్డి, కుటుంబ సభ్యులు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎనిమిది టన్నుల పూలతో 32 అడుగుల మహా బతుకమ్మ
సంగారెడ్డి, అక్టోబర్ 18 : రంగురంగుల పూల సోయగాలు.. బతుకమ్మ పాటలు.. మహిళల ఆటపాటల కోలాహలం నడుమ సంగారెడ్డి పట్టణంలోని(Sangareddy Town) కింది బజార్ పెద్ద చెరువు కట్టపై బతుకమ్మ సంబురాలు(Bathukamma Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి. జగ్గారెడ్డి(Jagga Reddy) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూలతో పేర్చిన బతుకమ్మలు, సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural Programs), విద్యుద్దీపాల అలంకరణలతో చెరువు కట్ట పండుగ శోభను సంతరించుకుంది.
ఎనిమిది టన్నుల పూలతో రూపొందించిన 32 అడుగుల మహా బతుకమ్మ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 16 టన్నుల ఉక్కుతో నిర్మాణాన్ని సిద్ధం చేసి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. భారీ బతుకమ్మను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలు పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు చెరువు కట్ట పొడవునా ఆరు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. ఆయా వేదికల వద్ద కళాకారుల ఆటపాటలు, జానపద గీతాలు అలరించాయి. ప్రత్యేక ట్రస్ లైటింగ్‌తో వేదికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. భారీ తెరలు, ఫ్లడ్‌లైట్ టవర్లు, విద్యుద్దీపాల వెలుగులతో చెరువు కట్ట పరిసరాలు కాంతులీనాయి. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని గత పది రోజులుగా పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
సాయంత్రం ఐదు గంటల నుంచే చెరువు కట్ట వద్దకు చేరుకున్న జగ్గారెడ్డి వేడుకల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం సంబురాల్లో పాల్గొని మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. నిర్మల జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. మహిళలతో కలిసి నిర్మల జగ్గారెడ్డి, జయారెడ్డి బతుకమ్మ ఆడుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన ఈ వేడుకల్లో పూల బతుకమ్మలు, మహిళల ఆటపాటలు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, కూన సంతోష్,కిరణ్‌గౌడ్, మహేష్ ముదిరాజ్, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.