మిరప తోటపై గడ్డి మందు..
ఏపుగా పెరిగిన పంటను నాశనం చేసిన దుండగులు.. లబోదిబోమంటున్న రైతు వేణు
టేకులపల్లి, (విజయక్రాంతి): కష్టపడి సాగు చేసిన మిరప పంటను(chili crop) గుర్తుతెలియని దుండగులు గడ్డి మందు పిచికారీ చేసి నాశనం చేయడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. టేకులపల్లి మండలం సింగ్యాతండాకు చెందిన రైతు లాకావత్ వేణు సాగు చేసిన మూడు ఎకరాల మిరప తోటపై గడ్డి మందు పిచికారీ చేయడంతో ఏపుగా పెరిగిన పంట దెబ్బతిన్నట్లు తెలిసింది.
పంట చేతికొచ్చే సమయంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడటంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతు వేణు లబోదిబోమంటున్నాడు.
రెక్కల కష్టాన్ని నమ్ముకొని సాగు చేసిన పంటను ఇలా నాశనం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి, తమకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల పంటలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.