విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
- కలెక్టర్ అంకిత్
- విద్య, వసతులు, భోజన సదుపాయాలపై కస్తూరిబా విద్యాలయంలో తనిఖీ
- NEET కోచింగ్‌తో విద్యార్థులకు మెరుగైన శిక్షణ
పాల్వంచ అక్టోబర్ 6, (విజయక్రాంతి): విద్యాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత(District Collector Ankita) అధికరణ ఆదేశించారు. పాల్వంచ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అందుతున్న విద్యా బోధన, నీట్ కోచింగ్, విద్యార్థుల హాజరు, పరీక్షల నిర్వహణ, మౌలిక వసతులు, భోజన సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు.
తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ ముందుగా ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల హాజరు నమోదును పరిశీలించారు. పాఠశాలలో బోధనా కార్యక్రమాలు సక్రమంగా కొనసాగుతున్నాయా, ఉపాధ్యాయుల హాజరు ఎలా ఉంది, విద్యార్థుల హాజరు శాతం ఎంత అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, గైర్హాజరయ్యే విద్యార్థుల వివరాలను నమోదు చేసి, అవసరమైన సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు.
అనంతరం ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుకు పరీక్ష రాస్తున్నారో అడిగి తెలుసుకోగా, కెమిస్ట్రీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. పరీక్షల అనంతరం విద్యార్థులకు నిర్వహిస్తున్న అధ్యయన కార్యక్రమాల గురించి కూడా కలెక్టర్ ఆరా తీశారు. నీట్ కోచింగ్‌లో భాగంగా విద్యార్థులకు సాయంత్రం 3.45 గంటల నుంచి 6.00 గంటల వరకు అదనపు బోధనా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ తరగతుల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ తదితర సబ్జెక్టుల్లో బోధన అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట ప్రక్రియ నుంచి భోజనం వడ్డించే వరకు పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందేలా సంబంధిత సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.