ఇక మెకానిక్ కోసం వెతకాల్సిన పనిలేదు
జనగామ విద్యార్థిని సంచలన ఆవిష్కరణ 'రిపేర్ మిత్ర'
జనగామ, అక్టోబర్ 06 (విజయక్రాంతి): ఇంట్లో ఏసీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ తదితర రిపేర్లు వచ్చినప్పుడు నమ్మకమైన టెక్నీషియన్ కోసం వెతకడం పెద్ద ఇబ్బంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని స్వాతి ఓదెల 'రిపేర్ మిత్ర(Repair Mitra)' అనే డిజిటల్ వేదికను రూపొందిస్తున్నారు. డా. కె. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో ఈ వేదికను అభివృద్ధి చేస్తున్నారు.
ఏసీ, టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ రిపేర్, హోమ్ క్లీనింగ్, పెయింటింగ్ వంటి అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయి. వినియోగదారుడు తన సమస్యను బుక్ చేసుకుంటే నిపుణుడు ఇంటికి వచ్చి ఖర్చు అంచనా చెబుతారు. ఇది స్థానిక టెక్నీషియన్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్వాతి తెలిపారు.