గ్యాస్ బండ పక్కదారి.. పర్యవేక్షణ శూన్యం!
- గృహ సిలిండర్లతో వాణిజ్య అవసరాలు
- టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ దుకాణాల్లో వినియోగం
- పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు?
బూర్గంపాడు, అక్టోబర్ 25 (విజయక్రాంతి): గృహ వినియోగానికి సబ్సిడీపై అందుతున్న వంటగ్యాస్ సిలిండర్లు(Gas Cylinders) పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నివాసాల్లో మాత్రమే వాడాల్సిన సిలిండర్లను టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో యథేచ్ఛగా వాడేస్తున్నారు.
వాణిజ్య సిలిండర్ల ధరకు, గృహ వినియోగ సిలిండర్ల ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు, గ్యాస్ ఏజెంట్లు అక్రమంగా మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా.. పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణ మృగ్యమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎక్కడ చూసినా ఇదే తీరు!
మండల కేంద్రం సహా ప్రధాన రహదారుల వెంట పుట్టగొడుగుల్లా టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ దుకాణాలు వెలుస్తున్నాయి. వీటిలో నిత్యం గ్యాస్ వినియోగం అత్యధికంగా ఉంటుంది. నిబంధనల ప్రకారం వాణిజ్య అవసరాలకు తప్పనిసరిగా ’కమర్షియల్ సిలిండర్లు’ మాత్రమే ఉపయోగించాలి. కానీ, మెజారిటీ దుకాణాల్లో గృహ వినియోగ (14.2 కేజీలు) సిలిండర్లే దర్శనమిస్తున్నాయి.
తక్కువ ధరకు లభించడమే కాకుండా, పక్కదారి పట్టించే దళారులు సులభంగా సరఫరా చేస్తుండటంతో వ్యాపారులు వీటికే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో అసలైన గృహ వినియోగదారులకు సబ్సిడీ లబ్ధి సరిగా అందడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తనిఖీలు ఏవీ?
గ్యాస్ సిలిండర్ల మళ్లింపును అరికట్టాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ అధికారులపై ఉంది. గ్యాస్ ఏజెన్సీల సరఫరా తీరుపై నిఘా ఉంచడంతో పాటు, వ్యాపార సముదాయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా గృహ సిలిండర్లను వ్యాపారాలకు వాడితే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో నామ్కేవాస్తే తనిఖీలు కూడా జరగకపోవడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
భద్రతకు పాతర!
ఈ అక్రమ వినియోగం కేవలం ఆర్థికపరమైన నష్టమే కాకుండా ప్రజల ప్రాణాల మీదకూ తెస్తోంది. ఇరుకైన దుకాణాలు, జనాభా సంచారం ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అసురక్షితంగా ఈ సిలిండర్లను వాడుతున్నారు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజీ జరిగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదముంది.
అడ్డుకట్ట పడేనా?
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు దక్కాలంటే అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతు న్నారు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి, బ్లాక్ మార్కెట్ విక్రయాలకు,
సిలిండర్ల పక్కదారికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు.