సికింద్రాబాద్ దండుమారమ్మ ఆలయంలో విధుల నిర్వహణపై వివాదం..!

26-10-2026 | 05:10am
  1. ఈఓ గైర్హాజరుపై ఆరోపణలు
  2. షాడో ఈఓగా జూనియర్ అసిస్టెంట్ సైదులు..?
  3. బోనాల ఖర్చుల లెక్కలేవీ..? 
  4. పురాతన వృక్షాల తొలగింపుపై అనుమతులు ఉన్నాయా? ప్రశ్నిస్తున్న భక్తులు

సికింద్రాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) బాలంరాయిలోని శ్రీ దండుమారమ్మ దేవాలయంలో పరిపాలనా వ్యవహారాలు, ఈఓ విధుల నిర్వహణపై వివాదం నెలకొన్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. కార్యనిర్వాహణాధికారి రవికాంత్ విధులకు సక్రమంగా హాజరవుతున్నారా? ఆలయ పరిపాలనలో సైదులు పాత్ర ఏమిటి? ఆయన అధికారికంగా ఈవోగా నియమితులయ్యారా?

లేక అనధికారికంగా ఈఓ తరహాలో వ్యవహరిస్తున్నారా? అనే అంశాలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. బోనాల జాతర ఏర్పాట్లలో నిర్లక్ష్యమా? దండుమారమ్మ దేవాలయంలో బోనాల జాతర ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, నిర్వహణ తీరు విషయంలో ఈఓ రవికాంత్ విఫలమయ్యారని కొందరు భక్తులు ఆరోపిస్తున్నారు. జాతర సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆదాయం, వివిధ పనులకు చేసిన ఖర్చులు, కాంట్రాక్టులు, బిల్లుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఖర్చుల లెక్కలు బహిర్గతం చేయాలి: భక్తుల డిమాండ్..

ఆలయ నిధులు, భక్తుల కానుకలు, జాతర నిర్వహణకు సంబంధించిన ఆదా య వ్యయాల వివరాలను సంబంధిత రికార్డులతో సహా పరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. ఖర్చులకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు, అనుమతులు, ఆడిట్ నివేదికలను ఉన్నతాధికారులు తనిఖీ చేస్తే వాస్తవాలు వెలుగులో కి వస్తాయని స్థానికులు, భక్తులు అంటున్నారు.

పురాతన వృక్షాల తొలగింపుపై అనుమానాలు..!

దైవస్వరూపంగా భావించే వృక్షాలను స్వలాభం కోసం తొలగించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. 2026 ఆగస్టు 12న అమావాస్య రోజున ఆలయ ప్రాంగణంలోని పురాతన మేడి వృక్షం, పవిత్ర మారేడు వృక్షాన్ని తొలగించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారుల అనుమతులు తీసుకున్నారా? వృక్షాల తొలగింపునకు ఎవరు ఆదేశించారు?

తొలగించిన కలప ఎక్కడికి తరలించారు? విక్రయించారా? విక్రయించి ఉంటే వచ్చిన సొమ్ము ఆలయ ఖాతాలో జమ చేశారా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఆరోపణలపై అటవీ శాఖ, సంబంధిత వృక్షాధికారులు,

దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి అనుమతుల రికార్డులు, కలప తరలింపు వివరాలు, ఆదాయ వ్యయాలను పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వృక్షాలను అక్రమంగా నరికివేశారనే ఆరోపణలు, కలపను విక్రయించారనే వాదనలకు సంబంధించి స్వతంత్ర నిర్ధారణ అవసరం.

చట్టాలు ఏం చెబుతున్నాయి?

తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్, 1987లోని సెక్షన్ 29 ప్రకారం కార్యనిర్వహణాధికారి నియామకం, విధులు, ఆలయ రికార్డులు, నిధులు, ఆస్తుల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు నిర్దేశించబడ్డాయి. సెక్షన్ 58 ప్రకారం ఆలయ ఆదాయ వ్యయాలపై క్రమబద్ధమైన ఖాతాలు నిర్వహించడం,

చట్టంలో నిర్దేశించిన విధంగా ఆడిట్ చేయించడం అవసరం.తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, 2002లోని సెక్షన్ 24 నుంచి 27 వరకు ఉన్ననిబంధనలను సంబంధిత సందర్భంలో పరిశీలించాలి. ముఖ్యంగా సెక్షన్ 27 ప్రకారం చెట్ల తొలగింపునకు వర్తించే అనుమతులు, మినహాయింపులు, సంబంధిత నిబంధనలను పరిశీలించడం అవసరం. ఏ చెట్టు జాతికి, ఏ ప్రాంతానికి, ఏ అధికార పరిధికి ఏ నిబంధన వర్తిస్తుందో అధికారులు నిర్ధారించాలి.

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలి..

అధికారిక బాధ్యతల నిర్వహణలో ఈఓ గావిధులకు గైర్హాజరు? జూనియర్ అసిస్టెంట్ సైదులుకు ఏదైనా అధికారిక బాధ్యత అప్పగించారా అనే అంశాలపై దేవాదాయ శాఖ కమిషనర్, సంబంధిత సహాయ కమిషనర్ విచారణ చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. బోనాల జాతర ఖర్చులపై ఆడిట్, వృక్షాల తొల గింపుపై అనుమతుల పరిశీలన, కలప తరలింపు వివరాలపై విచారణ జరిపి నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆరోపణలు నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలుతీసుకోవాలని, ఆరోపణలు నిరా ధారమైతే వాస్తవాలను అధికారికంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయ పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు పారదర్శక పరిపాలన అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు