ఆదివాసీలకు న్యాయం జరిగేలా జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

25-11-2026 | 05:31pm

లంబాడీల ఎస్టీ హోదాపై పునఃపరిశీలన చేయాలి

డిసెంబర్‌ 9న మహబూబాబాద్‌లో సాంస్కృతిక ధర్మయుద్ధం

తొమ్మిది ఆదివాసీ తెగల జేఏసీ చైర్మన్‌ చుంచు రామకృష్ణ

భద్రాచలం (విజయక్రాంతి): గత 50 ఏళ్లుగా ఆదివాసీ తెగలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని తొమ్మిది ఆదివాసీ తెగల జేఏసీ చైర్మన్‌, రిటైర్డ్‌ డీఈ చుంచు రామకృష్ణ(JAC Chairman Chunchu Ramakrishna demands) డిమాండ్‌ చేశారు. భద్రాచలంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు ఆదివాసీలకు పూర్తిస్థాయిలో దక్కడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవులు అంతరించిపోతుండటంతో ఆదివాసీల జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కేటాయిస్తున్న కోట్లాది రూపాయల నిధులు సైతం పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. దీంతో ఆదివాసీ తెగల మనుగడకే ముప్పు వాటిల్లిందన్నారు. గతేడాది సెప్టెంబర్‌ 28న భద్రాచలంలో ధర్మయుద్ధ సభ నిర్వహించి ఆదివాసీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఇప్పటివరకు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 9న మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో సాంస్కృతిక ధర్మయుద్ధం నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ విజయవంతం చేసేందుకు గత 20 రోజులుగా భద్రాచలం, నల్లమల ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో జోడో యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు ఇప్పటికే సభకు మద్దతు ప్రకటించారని, భద్రాచలం నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ ద్వారా ప్రత్యేక రక్షణ కల్పించారని గుర్తుచేశారు. 1976లో ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసీ తెగలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై పునఃపరిశీలన చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలపై నెపం నెట్టి తప్పించుకోకుండా ఆదివాసీల సమస్య పరిష్కారానికి ముందుకు రావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. గత 50 ఏళ్లుగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఆదివాసీలు ఏ మేరకు నష్టపోయారో తెలుసుకునేందుకు న్యాయ నిపుణులు, మేధావులతో జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణకు వచ్చిందని, కమిషన్‌ నివేదికను న్యాయస్థానానికి సమర్పిస్తే ఆదివాసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించిన విధంగానే ఆదివాసీల సమస్యకు కూడా పరిష్కారం చూపాలన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించే సాంస్కృతిక ధర్మయుద్ధానికి కోయ, గోండు, కొలాం, పర్ధాన్‌, కొండరెడ్డి, చెంచు, నాయకపోడు తదితర ఆదివాసీ తెగలకు చెందిన సాంస్కృతిక బృందాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన బృందాలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు, ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సభను పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

సభ నిర్వహణకు ఎన్టీఆర్‌ స్టేడియం వినియోగానికి అనుమతి లభించిందని, పోలీసుల అనుమతి కోసం గత వారమే మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సమస్యలను అర్థం చేసుకుని సభ నిర్వహణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక ధర్మయుద్ధానికి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు