సింగరేణి ఉద్యోగులకు సీపీఆర్‌పై ప్రత్యేక శిక్షణ

25-11-2026 | 05:18pm

- అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ ఎంతో కీలకం

- మహిళా ఉద్యోగులు, అప్రెంటిస్‌లు, కాంట్రాక్టు కార్మికులకు సైతం ప్రాయోగిక అవగాహన

ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి(Singareni) సంస్థ ఇల్లెందు ఏరియాలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏరియాలోని వర్క్‌షాప్, స్టోర్స్, హాస్పిటల్‌లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా విభాగాల వారీగా ఈ శిక్షణ కొనసాగింది. ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కె. రామదాసు, ఎంవీటీసీ మేనేజర్ ఆర్.ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొత్తగూడెం రెస్క్యూ టీమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా రెస్క్యూ ఇన్‌చార్జ్, అడిషనల్ మేనేజర్ పి. అనంతరామయ్య, షణ్ముఖ్ రెస్క్యూ బ్రిగేడ్ సిబ్బంది సీపీఆర్ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి ఉద్యోగులకు వివరించారు. గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ ప్రథమ చికిత్స అందించడం ద్వారా విలువైన ప్రాణాలను ఎలా కాపాడవచ్చో అవగాహన కల్పించారు. గుండె స్పందన ఆగిపోయినప్పుడు ఛాతీపై ఒత్తిడి కలిగించే విధానం, వైద్య సహాయం అందేలోపు సీపీఆర్ అందించాల్సిన పద్ధతులను ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించారు.

ఉద్యోగులతో స్వయంగా సాధన చేయించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణలో మహిళా ఉద్యోగులు సైతం ఉత్సాహంగా పాల్గొని సీపీఆర్ పద్ధతులను నేర్చుకున్నారు. ఉద్యోగులతో పాటు అప్రెంటిస్ విద్యార్థులు, కాంట్రాక్టు కార్మికులకు కూడా అవగాహన కల్పించడం విశేషం. అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరూ ప్రాణరక్షణ నైపుణ్యాలను కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా వర్క్‌షాప్ అధికారి దామోదర్, ఏరియా స్టోర్స్ అధికారి బి. నాగేశ్వరరావు, ఏరియా హాస్పిటల్ డాక్టర్ మురళీమోహన్, దేవేందర్ నాయక్ తదితర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు