ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచాలి

25-11-2026 | 05:16pm

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల, కళాశాలలో ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని, నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధులకు సమయపాలనతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sri Harsha) ఆదేశించారు. బుధవారం మంథని ప్రభుత్వ ఆసుపత్రి, టీ.జీ.డబ్ల్యూ.ఆర్.జె.సి పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ విభాగం, వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని, మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి తరగతి గదులు, విద్యాబోధన, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయులు, అధికారులకు సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అదనపు బోధన అందించాలని తెలిపారు. ప్రభుత్వ వైద్య, విద్యాసంస్థల్లో ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు