దీక్షా దివస్ సభకు రామగుండం నుంచి వేలాది మంది తరలింపు లక్ష్యం

25-11-2026 | 05:08pm

నవంబర్ 29న అలుగునూరులో భారీ సభ..

అనంతరం అమరవీరుల జ్యోతి వరకు మహాపాదయాత్ర

10 పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక ఇన్‌చార్జుల నియామకం

సభకు సంబంధించిన వాల్ పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

గోదావరిఖని, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభకు రామగుండం నియోజకవర్గం నుంచి వేలాది మందిని తరలించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్(Former MLA Korukanti Chander) తెలిపారు.

గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సభకు సంబంధించిన కార్యాచరణను ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చారిత్రాత్మక ఘట్టమని, ఆ పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 2001లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో మరో కీలక మలుపు తిరిగిందని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పదవులను త్యజించి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు. 2009 నవంబర్ 29న కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ అలుగునూరు చౌరస్తా వద్ద అరెస్టుకు గురై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని వివరించారు. ఆ దీక్షకు మద్దతుగా విద్యార్థులు, యువత, ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు.

ప్రజా ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో నవంబర్ 29న అలుగునూరు చౌరస్తా సమీపంలో భారీ దీక్షా దివస్ స్ఫూర్తి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ అనంతరం తెలంగాణ అమరవీరుల జ్యోతి వరకు మహాపాదయాత్ర చేపట్టి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించనున్నట్లు వెల్లడించారు.

10 పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక ఇన్‌చార్జుల నియామకం

రామగుండం నియోజకవర్గంలోని పది పట్టణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సభకు తరలించేందుకు ప్రత్యేక ఇన్‌చార్జులను నియమించినట్లు చందర్ తెలిపారు. రామగుండం టౌన్‌కు ఆముల నారాయణ, ఎన్టీపీసీ టౌన్‌కు మామిడాల ప్రభాకర్, గంగానగర్‌కు మూల విజయారెడ్డి, హనుమాన్‌నగర్‌కు కొంకటి లక్ష్మీనారాయణ, ఫైవ్ ఇంక్లైన్‌కు నారాయణదాస్ మారుతి, తిలక్‌నగర్‌కు నున్నె కొమురన్న, ఎల్‌బీనగర్‌కు నడిపెల్లి మురళీధర్‌రావు, గౌతమీనగర్‌కు అల్లం రాజన్న, లక్ష్మీనగర్‌కు మాదాసి రామ్మూర్తి, 8వ ఇంక్లైన్ కాలనీకి మిర్యాల రాజిరెడ్డిని బాధ్యులుగా నియమించినట్లు వివరించారు.

అంతర్గాం, పాలకుర్తి మండలాల సమన్వయ బాధ్యతలను కోల సంతోష్ గౌడ్, రాగం శ్రీనివాస్‌లకు అప్పగించినట్లు తెలిపారు. ఆయా మండలాల గ్రామాల వారీగా కూడా ప్రత్యేక బాధ్యులను నియమించి జన సమీకరణకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆర్‌జీ-1, ఆర్‌జీ-2 పరిధిలోనూ జన సమీకరణ బాధ్యతలను ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గ బాధ్యతలను మిర్యాల రాజిరెడ్డికి, ఆర్‌జీ-1 బాధ్యతలను వడ్డేపల్లి శంకర్‌కు, ఆర్‌జీ-2 బాధ్యతలను ఐలి శ్రీనివాస్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.

నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, ప్రతి ప్రాంతం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత, సింగరేణి కార్మికులను తరలించేందుకు బస్సుల ఏర్పాట్లు చేస్తున్నామని, 12 మంది ప్రధాన ఇన్‌చార్జులు, 46 మంది బస్సు ఇన్‌చార్జులను నియమించి సమన్వయ బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు.

ఉద్యమ స్ఫూర్తిని చాటాలి

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని, సకల జనుల సమ్మెలో వారు చురుకుగా పాల్గొని రాష్ట్ర సాధనలో కీలక భాగస్వాములయ్యారని కోరుకంటి చందర్ గుర్తుచేశారు. నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ స్ఫూర్తి సభకు రామగుండం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, యువత, అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియమితులైన ఇన్‌చార్జులు తమకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించాలని కోరారు. అనంతరం దీక్షా దివస్ స్ఫూర్తి సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు