గిరిజన విద్యార్థులకు నాణ్యతమైన విద్య..
* ఆశ్రమ పాఠశాలల్లో AXL – AI ఆధారిత డిజిటల్ విద్యా కార్యక్రమం...
* ఐటిడిఎపిఓ మంద మకరందు
ఉట్నూర్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 124 ఆశ్రమ పాఠశాలలతో పాటు గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలల్లో AXL – AI ఆధారిత డిజిటల్ విద్యా కార్యక్రమాన్ని అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు ఐటిడిఏ పిఓ మంద మకరందు(ITDA PO Mandha Makarandu) అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI), డిజిటల్ లెర్నింగ్, ICT ఆధారిత బోధనా పద్ధతులను తరగతి గదుల్లోకి తీసుకువచ్చి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకున్నట్లు పివో వివరించారు. సంప్రదాయ బోధనా పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులకు సులభంగా, ఆసక్తికరంగా, అర్థవంతంగా పాఠ్యాంశాలను బోధించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ బోధనా పద్ధతులు, AXL–AI ప్లాట్‌ఫామ్ వినియోగంపై శిక్షణ అందిస్తామన్నారు. ICT ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పాఠశాలల్లో డిజిటల్ అభ్యసన వాతావరణాన్ని బలోపేతం చేస్తామన్నారు. అదేవిధంగా, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు FLN (Foundational Literacy and Numeracy) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సాధిస్తామన్నారు. విద్యార్థుల ప్రాథమిక విద్యలో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి FLN వర్క్‌బుక్స్‌ను ఉపయోగిస్తామన్నారు. వీటి సమర్థవంతమైన వినియోగంపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమాల అమలులో భాగంగా ఉపాధ్యాయులకు one day ప్రత్యేక శిక్షణ నిర్వహించడంతో పాటు, శిక్షణ కార్యక్రమాల నాణ్యతను పెంపొందించేందుకు State Resource Persons, ACMOs, GCDOs తదితర విద్యాశాఖ సిబ్బంది భాగస్వామ్యంతో శిక్షణ, పర్యవేక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. గిరిజన విద్యార్థులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, నేటి పోటీ ప్రపంచంలో సమర్థవంతంగా రాణించేలా చేయడం, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ గౌడ్, ఐటీడీఏ విద్యాశాఖ జిల్లా ఉప విద్యాధికారి గోడం చందన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.