పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

25-11-2026 | 05:15pm

జగిత్యాల, నవంబర్ 25 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణ అభివృద్ధి, పద్మశాలి సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతపై బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి చేసిన విమర్శలకు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంటూ జిల్లా డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య(DCC President Gajengi Nandaiah), మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా ఎస్సీ సెల్ డీసీసీ అధ్యక్షుడు దూమాల రాజ్‌కుమార్ తదితరులు విలేకరుల సమావేశంలో విమర్శలు గుప్పించారు.

జిల్లా డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా భోగ శ్రావణి జగిత్యాల అభివృద్ధి, పద్మశాలి సామాజిక వర్గం గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమన్నారు. గతంలో ఆమె కుటుంబ సభ్యులు పద్మశాలి సేవా సంఘంలో బాధ్యతలు నిర్వహించిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని, సంఘం నుంచి బహిష్కరణకు గురైన చరిత్ర ఉందని విమర్శించారు. పద్మశాలి వర్గం అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే ముందు గతాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. భోగ శ్రావణి గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అవకాశం పొందారని, ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.

ఆమె మున్సిపల్ పాలన సమయంలో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నాయకులు కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. హరితహారం, ట్రాక్టర్ల కొనుగోలు, ఆటోలు, స్వీపింగ్ యంత్రాలు, భూములు తదితర అంశాల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. పద్మశాలి సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ జగిత్యాల, ధర్మపురి మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ పదవులను పద్మశాలి వర్గానికి కల్పించడంతో పాటు నేతన్నల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి గత ప్రభుత్వ బకాయిలను చెల్లించేందుకు రూ.350 కోట్ల నిధులు విడుదల చేయడం, నేతన్నలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు, వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ డిపో ఏర్పాటు వంటి చర్యలను ప్రస్తావించారు.

జగిత్యాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ, భోగ శ్రావణి ఎక్కడ, ఎప్పుడు చర్చకు పిలిచినా తాను ఒక్కడినే వచ్చి ఎదుర్కొంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నాయకత్వంలో జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజలకు అవి స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. జగిత్యాల పట్టణాన్ని యు ఐ డి ఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొంటూ, రూ.62.5 కోట్ల నిధులతో పట్టణ సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 12వ వార్డులో రూ.17 లక్షలతో, మురికి కాలువలు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టడం అభివృద్ధికి నిదర్శనమన్నారు.

గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందని, పద్మశాలి కార్పొరేషన్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ కార్పొరేషన్‌కు గూడూరి శ్రీనివాస్ చైర్మన్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అధికారంలో జోక్యం చేసుకోకుండా, బాధ్యతలు అప్పగించిన వారికి స్వేచ్ఛనిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తున్నారని గాజెంగి నందయ్య పేర్కొన్నారు. మున్సిపల్ పాలన సక్రమంగా సాగాలని, పట్టణ అభివృద్ధి జరగాలని ఎమ్మెల్యే సూచిస్తారే తప్ప ప్రతిరోజూ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోరని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల వివరాలను సవివరంగా పరిశీలించి మాట్లాడాలని సూచించారు. భోగ శ్రావణి గతంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా టవర్ ప్రాంతంలో తనను అవహేళన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రజా నాయకులపై విమర్శలు చేసే ముందు రాజకీయ స్థాయి, బాధ్యతను గుర్తించాలని అన్నారు. బీజేపీ నాయకులు కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం కాకుండా, తాము తీసుకొస్తున్న నిధులు, చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని సవాల్ విసిరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న నిధుల వాటా ఎంత ఉందో వివరించాలని అన్నారు. జగిత్యాల అభివృద్ధిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ కాలేజ్, రోడ్లు తదితర అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చారని తెలిపారు. యావర్ రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టారని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి సంబంధించి రైతులు, సంబంధిత వ్యక్తులతో చర్చించి భూముల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 వంటి పథకాల కింద నిధులు అందిస్తున్న తీరుపై విమర్శలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉంటుందని, కేంద్రం అందించే నిధులపై అతిశయోక్తులు చేయడం సరికాదని అన్నారు. జగిత్యాల అభివృద్ధికి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధుల వివరాలను బీజేపీ నాయకులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైద్య సేవలు, విద్య, సంక్షేమం, పట్టణ అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. ప్రభుత్వంపై, ఎమ్మెల్యేపై, మున్సిపల్ చైర్మన్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ ఏకవచనంతో మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, దానికి సంబంధించిన డీపీఆర్ ఇంకా పూర్తికాలేదని విమర్శించారు. కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చారిత్రక నేపథ్యాన్ని కూడా ప్రజలు గుర్తించాలని అన్నారు. అభివృద్ధిపై విమర్శలు చేసే బీజేపీ నాయకులు కేంద్రం నుంచి జగిత్యాలకు తీసుకొచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇట్టి పాత్రికేయ సమావేశములో మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగ బూషణం, బండ శంకర్, జగిత్యాల టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, పట్టణ మహిళా అధ్యక్షులు పిప్పరి అనిత, మాజీ వైస్ చేర్మెన్ సిరాజుద్దీన్ మన్సూర్, కౌన్సిలర్లు సుంకేటి మమత రామకృష్ణ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు