పినపాక కాంగ్రెస్‌ల్లో ముసలం?

11-11-2026 | 05:10am
  1. అంతర్గత విభేదాలతో పార్టీకి కొత్త తలనొప్పి!
  2. ఏఎంసీ చైర్మన్ పదవి చిచ్చుతో తెరపైకి వర్గపోరు!
  3. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు దూరమవుతున్న బ్రహ్మన్న బలగం!
  4. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటే లక్ష్యంగా రాజకీయ పావులు!
  5. తీవ్ర నైరాశ్యంలో శ్రీవాణి అక్క వర్గం!
  6. అశ్వాపురం, పినపాక కేంద్రంగా కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు!

మణుగూరు, నవంబర్ 10,(విజయక్రాంతి ):పినపాక నియోజకవర్గ(Pinapaka Constituency) కాంగ్రెస్ పార్టీలో(Congress Party) అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయా? పార్టీ శ్రేణుల్లో నెలకొన్న తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఏఎంసీ చైర్మన్ పదవి వ్యవహారం పార్టీ లో కొత్త చిచ్చుకు కారణమవుతోందనే ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సన్నిహితంగా ఉన్నట్లు భావించిన బ్రహ్మన్న బలగం దూరమవుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా కొందరు నాయకులు ప్రత్యేకంగా సమీకర ణాలు రూపొందిస్తున్నారనే చర్చ జోరందుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాజకీయ పావులు కదుపుతున్నారా?

ఎమ్మెల్యే అభ్యర్థిత్వమే లక్ష్యంగా కొందరు నేతలు తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారా? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యం గా మహిళా అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చి ప్రస్తుత ఎమ్మెల్యేకు రాజకీయంగా చెక్ పెట్టాలనే ఆలోచనతో కొందరు నాయకులు పావులు కదుపుతున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీవాణి అక్క వర్గంలో తీవ్ర నైరాశ్యం నెలకొందనే చర్చ సాగుతోంది.అశ్వాపురం, పినపాక మండలాలు ఈ అంతర్గత రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మారుతు న్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. స్థానిక నాయకుల మధ్య సమన్వయం లోపిస్తే పార్టీ ఐక్యతకు గండిపడే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

అధికారంలో ఉన్న కాంగ్రెస్లోనే ఆధిపత్య పోరు మొదలైతే భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏఎంసీ చైర్మన్ పదవి వివాదం కేవలం పదవులకే పరిమితమవుతుందా? లేక రాబోయే ఎన్నికల రాజకీయాలకు పునాది వేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.మొత్తానికి పినపాక కాంగ్రెస్లో వినిపిస్తున్న అంతర్గత అసంతృప్తి మాటలకే పరిమితమవుతుందా? లేక రానున్న రోజుల్లో రాజకీయ బాంబుగా పేలుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.


మరిన్ని వార్తలు