అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 21 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సాయుధ పోలీసులు “శోక్ శస్త్ర” నిర్వహించి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వీరమరణం పొందిన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల పేర్లను ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. వారి త్యాగాలు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన పది మంది పోలీస్ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా 1962 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు.
వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు పోలీస్ సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. దేశ భద్రత, అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఉగ్రవాదం, నక్సలిజం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్, ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.