టేకులపల్లిలో అత్యంత వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
టేకులపల్లి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబురాలను(Saddula Bathukamma) మహిళలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని గ్రామాల్లో నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
విద్యుత్ దీపాలంకరణలు(Electric light decorations), డీజే సౌండ్ సిస్టమ్లతో(DJ Sound System) పాటు బతుకమ్మల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, యువతులు బతుకమ్మల చుట్టూ చేరి జానపద గీతాలు ఆలపిస్తూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
మహిళలతో పాటు స్థానిక నాయకులు సైతం బతుకమ్మ ఆటల్లో పాల్గొని సందడి చేశారు. గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ సంబురాలను తిలకించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను నిమజ్జనం చేయడంతో వేడుకలు ముగిశాయి.