చిన్నారుల్లో పెరుగుతున్న మధుమేహం
హార్మోన్ సమస్యలపై జాతీయ స్థాయి సదస్సు
పీఏఈడీఎస్ 2026లో నిపుణుల చర్చలు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): చిన్నారుల్లో పెరుగుతున్న మధుమేహం(Diabetes)తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలపై నియోనాటాలజిస్టులు, పీడియాట్రీషియన్లు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న మధుమేహం, ఎదుగుదల లోపాలు, చిన్న వయసులోనే యుక్తవయస్సు లక్షణాలు కనిపించడం, ఆలస్యంగా యుక్తవయస్సు రావడం, ఊబకాయం, థైరాయిడ్, ఇతర హార్మోన్ సంబంధిత సమస్యలపై పీఏఈడీఎస్ 2026 జాతీయ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ సదస్సు(National Pediatric Endocrinology Conference) నిర్వహించారు.
కిమ్స్ కడల్స్ క్లినికల్ డై రెక్టర్, చీఫ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ బాబు ఎస్ మాడార్కర్ మాట్లాడుతూ, చిన్నారులు, కౌమారదశలో ఉన్నవారిలో హార్మోన్లు, జీవక్రియలకు సంబంధించిన వ్యాధులను ముం దుగానే గుర్తించడం, సమర్థవంతమైన చికి త్స అందించడం, దీర్ఘకాలికంగా పర్యవేక్షించడంపై వైద్యుల అవగాహన, నైపుణ్యాలను పెంచడమే ఈ సదస్సు లక్ష్యమని తెలిపారు.
దేశంలోని ప్రముఖ పీడియాట్రీషియన్లు, ఎండోక్రైనాలజిస్టులతో పాటు వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ఈ సదస్సులో పాల్గొని శాస్త్రీయ చర్చలు, నిపుణుల ప్రసంగాలు, ప్రాక్టికల్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు.టైప్-2 మధుమేహంలో మెట్ఫార్మిన్ తర్వాత అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు, జీఎల్‌పీ 1 అనలాగ్స్, టైప్-1 మధుమే హంలో వస్తున్న ఆధునిక చికిత్సా పద్ధతులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న మార్పులపై చర్చించినట్లు తెలిపారు.
పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీలో జన్యుపరమైన అంశాలు, పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీఎంఓఎస్), చిన్నారుల్లో ఊబకాయం వంటి అంశాలపై కూడా నిపుణులు దృష్టి సారించారు. చిన్నారుల్లో హార్మోన్ సమస్యలను తొలిదశలో గుర్తించి, సరైన సమయంలో చికిత్స అందించడం, దీర్ఘకాలికంగా పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక సమస్యలను నియంత్రించే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఏఈడీఎస్ 2026 సదస్సు ద్వారా చిన్నారుల్లో సంక్లిష్టమైన హార్మోన్, జీవక్రియ సంబంధిత సమస్యల నిర్ధారణ, చికిత్సలో తాజా వైద్య విధానాలపై వై ద్యులకు మరింత అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
