నిమజ్జనానికి నీళ్లేవి?
- చింతకుంట కెనాల్‌కు ఎస్‌ఆర్‌ఎస్‌పి నీరే ఆధారం
- కోర్టు వివాదంలో కొత్తపల్లి చెరువు
కరీంనగర్, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): కరీంనగర్(Karimnagar)లో గణేష్ నిమజ్జనానికి(Ganesh Immersion) నీటి సమస్య(Water problem) ఏర్పడింది. ప్రతి ఏటా మనకొండూర్, చింతకుంట, కొత్తపల్లిలలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చింతకుంట పరిసర ప్రాంతాల్లోని గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రతి సంవత్సరం ఉపయోగించే ఎస్సారెస్పీ కాలువల్లో(SSRS Canal) ప్రస్తుతం తగినంత నీరు లేదు. దీనివల్ల నిమజ్జనానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు, ముందస్తుగా కాలువల్లోకి నీటిని విడుదల చేయవలసి ఉంటుంది. మూడు రోజుల ముందు నీటిని విడుదల చేస్తేనే నిమజ్జనానికి వీలుంటుంది.
కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) చెరువును సందర్శించి అధికారులను నీరు విడుదల చేయాలని కోరారు. బుధవారం కరీంనగర్ లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఈఎన్సి రమేష్ తో ఫోన్ లో మాట్లాడి నిమజ్జనంకు ఆటంకం కలగకుండా నీటిని విడుదల చేయాలని కోరారు. ఎస్ ఆర్ ఎస్ పి లో నీటి లభ్యత ఆధారంగా నీటి విడుదల పై నిర్ణయం తీసుకొనున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా నీటి విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొత్తపల్లి చెరువు లో నిమజ్జనంకు కోర్టు వివాదం సమస్యగా మారింది.
కొత్తపల్లి చెరువు వద్ద గతంలో నిమజ్జనం చేసిన ప్రాంతానికి సంబంధించిన భూమి సర్వే నంబర్ 626 లోని 33 గుంటల స్థలం తనదే అంటూ పట్టాదారు కోర్టుకు వెళ్లడంతో అక్కడ నిమజ్జన స్థలాన్ని మార్చవలసిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు వివాదంతో పాటు రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల, భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు లక్ష్మీపూర్ వైపుగా ప్రత్యామ్నాయ మార్గాలను, కొత్త నిమజ్జన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సుడా మాజీ చైర్మన్, జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులు ఇప్పటికే ఈ స్థలాలను సందర్శించి పనులు వేగవంతం చేశారు. నిమజ్జన సమయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.