30 రోజుల్లోగా పరిష్కారం

17-09-2026 | 05:25am

22ఏ జాబితాలోని పేదల ఆస్తులకు న్యాయం

12 మార్గదర్శకాలను వెల్లడించిన సీఎం రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో 22 ఏ కింద నిషేధిత జాబితా(Prohibited list)లో నిరుపేదలకు సంబంధించిన ఆస్తులపై 30 రోజుల్లోగా న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. 22ఏ నిషేధిత జాబితా వివాదాల పరిష్కారానికి సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి(Special Secretary, CCLA), న్యాయ శాఖ కార్యదర్శి(Secretary, Law Department), స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్(Stamps and Registration) ఉన్నతాధికారితో కూడిన హైపవర్ ఆఫీసర్స్ కమిటీ(High Power Committee of Officers)ని నియమిస్తున్నట్టు తెలిపారు. నిషేధిత జాబితా 22ఏ పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చపై సీఎం సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.

నిజాం కాలం నుంచి ఉమ్మడి ఏపీ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు భూములకు సంబంధించి చేసిన చట్టాలు, వాటి చారిత్రక పరిణామ క్రమాన్ని సభలో వివరించారు. -న్యాయమైన, చట్టబద్ధమైన అంశాల్లో నిరుపేదలకు అన్యాయం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రధానంగా ప్రభుత్వం గుర్తించిన 12 అంశాల్లో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

ప్రభుత్వం గుర్తించిన 12 అంశాలు

1. అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) భూములులను  పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలు. యూఎల్సీ మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం త్వరలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఈ పథకం పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో చేపడుతాం.

2. అధీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూమలు (హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీపీసీ) కాంపిటెంట్ అథారిటీచే ఆమోదించబడిన లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెడుతుంది.

3. సింగరేణి బొగ్గు గని (కోల్ బెల్ట్) ప్రాంతాల్లోని ఇళ్ల సమస్యకు  జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిర్దేశిత అర్హత ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుంది.

4. జీవో 59 సమస్యలోని కన్వెయన్స్ డీడ్స్ (హక్కు బదిలీ పత్రాలు) జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హతల ప్రాతిపదికన తుది పరిశీలన జరిపి పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులు నూతన క్రబద్ధీకరణ విధానం కింద పరిష్కరిస్తాం.

5. జీవో 118 (ఎల్బీ నగర్ నియోజకవర్గం) పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తాం. పరిష్కారమైన అన్ని కేసులను వెంటనే సెక్షన్ 22  నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం.

6. అసైన్డ్ భూములలో నిర్మించిన గృహాలకు సంబంధించి  తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధ) చట్టం 1977 పరిధిలోకి వస్తున్నందున, ఈ అంశంపై సమగ్ర న్యాయ సమీక్షతో పాటు విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటాం.

7. ఇందిరమ్మ పథకం- ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇండ్లు అత్యంత నిరుపేదల ఆస్తులకు సంబంధించినది అయినందున, దీనిపై విస్తృతస్థాయి సంప్రదింపులు జరుపుతాం.

8. ఇందిరమ్మ పథకం- లబ్ధిదారుని సొంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇండ్లు కావడంతో.. ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ (లావాదేవీల నియంత్రణ గడువు) ముగిసిన తర్వాత క్రయవిక్రయాలకు అనుమతి మంజూరు చేస్తాం.

9. ప్రైవేటు పట్టా భూములు -నాలా రుసుము చెల్లించని కేసులకు సంబంధించి.. నాలా ఛార్జీలు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను కలిపి క్రయవిక్రయాలకు అనుమతిస్తాం.

10. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు, కాలనీలకు సంబంధించి అనధికారిక లేఅవుట్లు నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకొస్తాం.

11. సికింద్రాబాద్ పరిధిలోని లీజ్ హోల్ ఆస్తుల ఫ్రీహోల్ క్రమబద్దీకరణకు చెందిన కేసులను 30 రోజుల నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించేందుకు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం.

12. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్మెంట్ భూములు, భూదాన్ భూములు అంశాలను నిరుపేద, బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాల కోసం భూమిని, ఆర్థిక వనరులను సమీకరించే ఉద్దేశంతో ఈ భూములను సమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తాం. ఈ విధానం ద్వారా సమీకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని నిరుపేద లబ్దిదారులకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగిస్తాం. 

మరిన్ని వార్తలు