చీకట్లో శ్రమ..లోకానికి వెలుగు

17-09-2026 | 05:05am
  1. సింగరేణి కార్మికులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా
  2. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  3. జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): జాతీయ కార్మిక దినోత్సవాన్ని(National Labor Day) పురస్కరించుకొని సింగరేణి కార్మికులకు(Singareni workers') కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచన దినం(Telangana Liberation Day), విశ్వకర్మ జయంతి(Vishwakarma Jayanti) 17నే జరుపుకోనున్న నేపథ్యంలో బుధవారం ఆయన కార్మికులకు లేఖ రాశారు. ‘చీకటి గనుల్లో పగలనక, రాత్రనక పనిచేస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సింగరేణి కార్మికుల శ్రమకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని పేర్కొన్నారు.

క్లిష్టమైన పరిస్థితుల్లో రేయింబవళ్లు శ్రమించి దేశాభివృద్ధికి తోడ్పగుతున్న మీరంతా తన దృష్టిలో యోధులని కొనియాడారు. దేశ ఇంధన భద్రతలో మీ భాగస్వామ్యానికి.. నా తరపున, ప్రధానమంత్రి మోదీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వరుసగా గత రెండేళ్లుగా.. మనదేశంలో బొగ్గు ఉత్పత్తి బిలియన్ టన్ను మైలురాయిని దాటింది. 135 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు.. తరతరాల కార్మికుల కష్టం. వేలాది కుటుంబాల జీవనాధారం.

తెలంగాణకు ఎంతో గర్వకారణం. కోయగూడెం- బొగ్గు బ్లాక్ కూడా సింగరేణికి చెందేలా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాను. ఇవన్నీ, సింగరేణి బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటుగా.. సంస్థ మరో 40 ఏళ్లపాటు తెలంగాణ, దేశ ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషించేలా సింగరేణి కార్మికులకు, మీకు మీ కుటుంబసభ్యుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలనేదే నా ప్రయత్నం’ అని లేఖలో పేర్కొన్నారు. ‘సెప్టెంబర్ 17 మన తెలంగాణ చరిత్రలో మరచిపోలేని రోజు.

నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగమైన రోజును మనం గర్వంగా గుర్తుచేసుకుంటున్నాం. ఆ స్వేచ్ఛ కోసం పోరాడిన వీరులకు, ప్రాణత్యాగం చేసిన అమరులకు, దేశ సమైక్యత, సమగ్రత కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి ఘనంగా నివాళులు అర్పిద్దాం. వారు అందించిన స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ తెలంగాణను, దేశాన్ని అభివృద్ధి దిశలో మరింత ముందుకు తీసుకెళ్దాం.

సెప్టెంబర్ 17కు మరో ప్రత్యేకత ఉంది. నరేంద్రమోదీ జన్మదినం. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధించాలన్న ప్రధానమంత్రి సంకల్పంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమిష్టిగా కృషిచేస్తూ.. దేశాభివృద్ధిలో మరింత ఉత్సాహంగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీ కష్టం దేశానికి ఎంత అవసరమో.. మీ ఆరోగ్యం, మీ కుటుంబాల ఆనందం కూడా అంతే విలువైనవి’ అంటూ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు