పొంగులేటిపై ప్రివిలేజ్ నోటీసులు

17-09-2026 | 05:30am

రూల్ 168 కింద స్పీకర్‌కు ఇచ్చిన మాజీమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా

22ఏ భూముల చర్చలో అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదు

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy)పై మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy) సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూములు(Prohibited lands), ధరణి(Dharani) అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి తమపై సత్యదూరమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు. తెలంగాణ శాసనసభ కార్యవిధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని రూల్ 168 కింద స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బుధవారం ఈ నోటీసులు సమర్పించారు.

ఈనెల 12న అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూములపై జరిగిన చర్చ సందర్భంగా తనపై, తన కుటుంబ సభ్యులపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ము ఖ్యంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని సర్వే నంబర్ 271లోని భూమికి సంబంధించి మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 271లో దాదాపు 327 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 6.18 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా పట్టా భూమిగా మార్చారని మంత్రి సభలో పేర్కొన్నారని తెలిపారు.

తన మామ హనుమంతరావు పేరుతో ఆ భూమి ని పట్టా చేయించానని మంత్రి ఆరోపించినట్లు వివరించారు. అయితే తన మామ హనుమంతరావు  చట్టబద్ధంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని హరీశ్‌రావు స్పష్టం చేశారు.  మంత్రి ఆరోపణల్లో వాస్తవం లేద ని పేర్కొంటూ స్పీకర్‌కు సమర్పించిన నోటీసులో అభ్యంతరం తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లి పరిధిలోని సర్వే నంబర్ 188లో సుమా రు రూ.3 వేల కోట్ల విలువైన 29 ఎకరాల భూదాన్ భూమిని తాను ఆక్రమించుకుని, ధరణిని అడ్డం పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మంత్రి సభలో ఆరోపించారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. 

తనకు వట్టినాగులపల్లిలో ఉన్న భూమి కేవలం 1 ఎకరం 10 గుంటలు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే, 2014 జూన్ మొదటి వారంలోనే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. శాసనసభ వంటి వేదికపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ద్వారా మంత్రి సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని హరీష్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి చేసిన ప్రకటనలు సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ రూల్ 168 కింద నోటీసులు ఇచ్చారు. తమపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అధికారిక పత్రాలను పరిగణనలోకి తీసుకుని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

మరిన్ని వార్తలు