ఎండిన చెట్టు రూపంలో మృత్యువు
కొత్త జీవితం.. విదేశీ ఉద్యోగం.. అంతలోనే ఊహించని విషాదం!
హైదరాబాద్: కొత్తగా పెళ్లయింది.. మరికొద్ది రోజుల్లో విదేశీ ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అంతలోనే ఎండిపోయిన చెట్టు రూపంలో మృత్యువు కబళించింది. రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై(Infosys Engineer Dies) భారీ చెట్టు కూలిపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అతనితో పాటు ప్రయాణిస్తున్న బంధువుల అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని కుంట్లూరు ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
నాగోలు పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా(Dr. B.R. Ambedkar Konaseema District) రాజోలుకు చెందిన వి. సాయికుమార్ (29) నాగోలు బండ్లగూడలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ, ఇందు అరణ్యలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని Infosys సంస్థలో SAP Software Engineerగా పనిచేస్తున్నాడు. బుధవారం గ్యాస్ బుక్ చేసేందుకు బంధువుల అబ్బాయి సత్య ఫణీంద్రతో కలిసి బైక్‌పై ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని గ్యాస్ గోదాంకు బయలుదేరాడు.ఈ క్రమంలో కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీ సమీపంలో రోడ్డుపై ఉన్న ఎండిన చెట్టు ఒక్కసారిగా కూలి సాయికుమార్‌పై పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఫణీంద్ర గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే చెట్టును తొలగించి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే సాయికుమార్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కాగా, సాయికుమార్‌కు నెల రోజుల క్రితమే వివాహమైంది. మరో నెల రోజుల్లో జర్మనీలో ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదం అతడి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. రోడ్డుపై ఎండిపోయి కూలేందుకు సిద్ధంగా ఉన్న చెట్ల గురించి గతంలోనే అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు హెల్మెట్ ధరించి ఉంటే తలకు గాయం కాకుండా ప్రాణాలు దక్కే అవకాశం ఉండేదని పోలీసులు పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రమాదకర చెట్లు రోడ్లపై ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయనే ఆందోళన ఈ ఘటనతో మరోసారి వ్యక్తమవుతోంది.