ప్రభుత్వ భూముల విక్రయాన్ని ఆపకపోతే ఉద్యమమే
- వాటిని ప్రజా అవసరాలకే వినియోగించాలి
- ప్రజల ఆస్తులను అమ్మి ఖాజానా నింపుకోవద్దు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు
శేరిలింగంపల్లి, నవంబర్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వ భూముల విక్రయాన్ని ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు(BJP State President N Ramchander Rao) హెచ్చరించారు. మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించకుండా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఎంఏనగర్ కాలనీని సందర్శించి స్థానిక నివాసితులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..1912 నాటి సర్వే రికార్డుల నుంచే ఈ భూములు ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయని, 1949లో జాగీర్ వ్యవస్థ రద్దుతో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయన్నారు. 2003లో హైకోరు తాజాగా సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చాయని పేర్కొన్నారు.
మొత్తం 550 ఎకరాల్లో సుమారు 150 ఎకరాల్లో ఎంఏనగర్, స్టాలిన్ నగర్ తదితర కాలనీలు ఉండగా, మిగిలిన 400 ఎకరాలను విక్రయించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రజల ఆస్తులను అమ్మి ఖజానా నింపుకోవడం కాకుండా శేరిలింగంపల్లి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వాటిని వినియోగించాలని సూచించారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మిగిలిన 400 ఎకరాల్లో 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాల, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు, క్రీడా మైదానాలు, పెద్ద పార్కు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకెళ్తామని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి సంతకాలతో కూడిన వినతిపత్రాలను ముఖ్యమంత్రి, గవర్నర్‌కు అందజేస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు సింధు రెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.