ఏపీ జలదోపిడీకి రేవంత్ సహకారం
- సాగర్ నుంచి 90 టీఎంసీల నీటి తరలింపునకు ఏపీ కుట్ర
- ఏడాదిగా సొరంగం తవ్వుతుంటే ఏం చేస్తున్నారు?
- చంద్రబాబు, మోదీ మెప్పు కోసమేనా మౌనం?
- అడ్డుకోకుంటే న్యాయ పోరాటం, ప్రజా ఉద్యమం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
- ఏపీలో క్రాప్ హాలిడే లేదు.. తెలంగాణలో ఎందుకని ప్రశ్న
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ నుంచి 90 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలకు సీఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన రేవంత్.. ఏపీ జలదోపిడీపై మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. తాగునీటి పథకం పేరుతో డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు ఏడాదిగా సొరంగం నిర్మిస్తున్నా ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయపురి సౌత్ వద్ద 510 అడుగుల లోతులో నీటిని తరలించేందుకు నిర్మాణాలు చేపడుతున్నా సీఎం, నీటిపారుదల శాఖ అధికారులకు తెలియదా? అని నిలదీశారు. ప్రభుత్వానికి తెలిసే ఈ వ్యవహారం జరుగుతోందని, చంద్రబాబు, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తాగునీటి పథకం ముసుగులో 1,650 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించి 90 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోందని, దీని ద్వారా సాగునీటిని కూడా మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నదీ జలాల విషయంలో సమైక్య పాలకుల కంటే పెద్దద్రోహం రేవంత్ చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ కుడి కాలువ కింద క్రాప్ హాలిడే లేకపోగా, తెలంగాణ వైపు ఎడమ కాలువ కింద ఎందుకు అమలవుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీకి ఎగువన తాగునీటికి అందుబాటులో ఉన్న నీరు కేవలం 3.5 టీఎంసీలేనని, ఈ పరిస్థితుల్లో సాగర్ నుంచి 90 టీఎంసీల తరలింపునకు అనుమతిస్తే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల తాగునీటి అవసరాలకూ ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబరులో హైదరాబాద్‌లో 2.50 లక్షల ట్యాంకర్లు బుక్ కాగా, రోజుకు సుమారు 8 వేల ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపారు.
పాలమూరు, నల్లగొండకు అన్యాయం
నాగార్జునసాగర్ ఆయకట్టులో తెలంగాణకు 28 శాతం, ఏపీకి 72 శాతం వాటా ఉండటమే గత పాలకుల వివక్షకు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు 8.8 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పినా ప్రస్తుతం ౬ లక్షల ఎకరాలకు మించి అందడం లేదన్నారు. కృష్ణా నది పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా సాగునీటి విషయంలో అన్యాయం జరిగిందని విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 174 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
జూరాల ఆయకట్టు లక్ష్యాన్ని రెండు లక్షల ఎకరాల నుంచి 1.10 లక్షల ఎకరాలకు తగ్గించారని, ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం 15 వేల ఎకరాలకే పరిమితమైందని వివరించారు. టీడీపీ ప్రభుత్వాలు పాలమూరు, నల్లగొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం చేశాయని మండిపడ్డారు. పాలమూరును వలసల జిల్లాగా మార్చడంలో చంద్రబాబు పాపం కూడా ఉందని.. కానీ, నేడు ఆయన కనుసన్నల్లో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి నాగార్జునసాగర్‌లో తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు.
ఏపీ జలదోపిడీపై తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం, ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం, వట్టెం పంప్‌హౌస్ మునక వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని విమర్శించారు.
కేటాయింపులపై స్పష్టతేదీ?
పాలమూరు- ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, వట్టెం, కరివెన, ఏదుల, ఉద్దండాపూర్, నార్లాపూర్ రిజర్వాయర్లను పూ ర్తి చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టు కాలువల పనులను ఎందుకు నిలిపివేశారు?, ఏ కారణంతో టెండర్లు రద్దు చేశారు? అని ప్రశ్నించారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకునేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా నదిలో వచ్చిన సుమారు 250 టీఎంసీల నీటిని వినియోగించకుండా ఏపీకి, సముద్రంలోకి వదిలేశారని ఆరోపించారు. చంద్రబాబు 730 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీటిని తరలిస్తుంటే, కృష్ణా నదికి 70 కిలో మీటర్ల సమీపంలో ఉన్న పాలమూరు జిల్లాకు సాగునీరు అందించలేకపోవడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు ఇది నిదర్శనమన్నారు. సాగర్‌లో నీటి తరలింపు ప్రయత్నాలను అడ్డుకునేందుకు కేఆర్ఎంబీకి పార్టీ తరఫున లేఖ రాస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, ప్రజా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ఉద్యమ కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు.