బీఆర్‌ఎస్ పాలనలో విధ్వంసం

19-11-2026 | 05:35am
  1. సాగునీటి రంగానికి రూ.1.83 లక్షల కోట్ల ఖర్చు చేసి ఏం సాధించారు?
  2. కృష్ణా బేసిన్‌ను విస్మరించి రైతులకు అన్యాయం చేశారు 
  3. ఏపీ నీటి తరలింపుపై అభ్యంతరాలు
  4. మన నీటి వాటాలో చుక్క వదులుకోం 
  5. సోనియా, నెహ్రూ చరిత్ర తెలుసుకో
  6. కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ కౌంటర్ 

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ సాగునీటి రంగానికి తీరని నష్టం జరిగిందని, రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినా రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందించలేకపోయారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వాటాపై మాట్లాడుతున్న కేటీఆర్.. పదేళ్ల పాలనలో ఏం సాధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కృష్ణా బేసిన్‌ను నిర్లక్ష్యం చేసి తెలంగాణ రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. సోనియాగాంధీ, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు చేసే ముందు తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో సాగునీటి రంగంపై సుమారు రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందుకు తగ్గ ఫలితాలు సాధించలేకపోయిందన్నారు.

భారీగా నిధులు వెచ్చించినా అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, అంచనా వ్యయాలు పెరిగాయని విమర్శించారు. పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ఆధునికీకరణ, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టుల పురోగతిపై బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వీటికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో సాగునీటి విస్తీర్ణం గణనీయంగా పెరిగేదన్నారు. గత ప్రభుత్వం సాగునీటి వ్యయంలో 75 శాతం గోదావరి బేసిన్‌లో ఖర్చు చేయగా, కృష్ణా బేసిన్‌కు కేవలం 25 శాతమే వెచ్చించిందని ఉత్తమ్ ఆరోపించారు.

దీంతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల రైతులకు అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా జలాల కేటాయింపుల్లోనూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేకపోయిందని విమర్శించారు. మొత్తం 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించే నిష్పత్తికి బీఆర్‌ఎస్ అంగీకరించిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు 555 టీఎంసీల నీటిని కేటాయించాలని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తోందన్నారు. నదీ పరీవాహక ప్రాంతం, సాగునీటి అవసరాలు, జనాభా తదితర అంశాల ఆధారంగా రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించేందుకు పోరాడుతున్నామని తెలిపారు.

కృష్ణా జలాల వినియోగంలో విఫలం

గత బీఆర్‌ఎస్ పాలనలో కృష్ణా జలాల వినియోగంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ 4,464 టీఎంసీల నీటిని వాడుకోగా, తెలంగాణ వినియోగం 1,993 టీఎంసీలకే పరిమితమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల్లో నీటి వినియోగం పెరిగిందని, అక్టోబర్ 30 నాటికి ఏపీ98.16 టీఎంసీల నీటిని వినియోగించుకోగా, తెలంగాణ 122.74 టీఎంసీలు వాడుకుందని తెలిపారు.   పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 2014లో ప్రకటించి, డీపీఆర్‌ను 2022లో సమర్పించారని గుర్తు చేశారు. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని ఆరోపించారు.

సోనియాగాంధీ సంకల్పం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఈ విషయాన్ని కేసీఆర్ సైతం శాసనసభలో చెప్పారని గుర్తుచేశారు. సోనియాగాంధీ ఆత్మకథలో  తెలంగాణ ప్రస్తావన ఉందా లేదా అన్నది ముఖ్యం కాదని, రాష్ట్ర ఏర్పాటుకు ఆమె తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే కేటీఆర్ కుటుంబానికి రాజకీయ పదవులు వచ్చాయని వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో నెహ్రూ కృషిని కేటీఆర్ తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరమన్నారు.  

నీటి వాటాలో రాజీలేదు

నాగార్జునసాగర్ నుంచి 1.8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం తెలిపిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. ఏపీ చేపట్టే ప్రాజెక్టులు తెలంగాణకు ముప్పుగా పరిణమిస్తే వాటిని అడ్డుకుంటామని, మన వాటా నీటిలో చుక్క కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించలేదని, ఆరుతడి పంటలు వేయాలని మాత్రమే రైతులకు సూచించామని మంత్రి వెల్లడించారు. 

మరిన్ని వార్తలు