హైదరాబాద్‌లో 85వ ఐఆర్‌సీ

19-11-2026 | 05:30am
  1. నేటి నుంచి నాలుగు రోజులు జాతీయ సదస్సు
  2. ప్రారంభించనున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
  3. 3,500 మంది ప్రతినిధులు, 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు, 19 సాంకేతిక సదస్సులు
  4. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సమావేశాలు గురువారం నుంచి కొనసాగుతాయని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు హైటెక్స్‌లో జరిగే ఈ జాతీయ సదస్సును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) ప్రారంభిస్తారని తెలిపారు. 

 బుధవారం మీడియాతో సదస్సు వివరాలను మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా రహదారులు, జాతీయ రహదారుల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు, ప్రభుత్వ అధికారులు, మౌలిక సదుపాయాల రంగ ప్రతినిధులు కలిపి సుమారు 3,500 మంది ఈ సదస్సుకు రానున్నారని తెలిపారు.  ఈ ఏడాది ఈ సమావేశాలను తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి తెలంగాణలో చేపడుతున్న రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సమీక్షించనున్నట్లు చెప్పారు. 2026 రాష్ట్ర బడ్జెట్‌లో రోడ్లు, వంతెనల అభివృద్ధికి రూ.5,677 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ, హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్, ఫ్యూచర్ సిటీ పోర్టు గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎన్‌హెచ్-167, కరీంనగర్ రహదారి, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని పేర్కొన్నారు.

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) కింద గ్రామీణ రహదారుల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీ 2025 సుమారు రూ.17.82 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 

నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సుమారు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు, 19 సాంకేతిక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. అధునాతన యంత్రాలు, వినూత్న నిర్మాణ సాంకేతికతలు, ఆధునిక మౌలిక సదుపాయాల పరిష్కారాలను ప్రదర్శించనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్రంలో కొనసాగుతున్న, ప్రతిపాదిత రహదారులు, వంతెనలు, ఇతర మౌ లిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. దీంతో రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి అవకాశాలను జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, పెట్టుబడిదారులకు వివరించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు