యువకుడి మృతదేహం లభ్యం
మృతుడు దమ్మపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కడెం మనోజ్ (20)
తండ్రి ఫిర్యాదుతో సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
దమ్మపేట: సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామనగరం గ్రామ శివారులో ఉన్న బేతుపల్లి చెరువులోని కలంగి ప్రాంతంలో కడెం మనోజ్ (20) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన కడెం సురేష్ కుమారుడు కడెం మనోజ్ (20) డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
గత కొంతకాలంగా తనకు ట్రాక్టర్ కొనివ్వాలని తండ్రిని కోరుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల కారణంగా ట్రాక్టర్ కొనివ్వలేకపోయిన తండ్రి, వచ్చే సంవత్సరం కొనిస్తానని కుమారుడికి చెప్పాడు. ఈ క్రమంలో 06-11-2026వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మనోజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, స్నేహితుల వద్ద, పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.
ఈ విషయమై అతని తండ్రి దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 09-11-2026 ఉదయం సుమారు 9 గంటలకు వుకే శివ అనే వ్యక్తి ఫోన్ చేసి, మనోజ్ మృతదేహం బేతుపల్లి చెరువులో ఉన్నట్లు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. ట్రాక్టర్ కొనివ్వలేదనే మనస్తాపంతో మనోజ్ జీవితంపై విరక్తి చెంది బేతుపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన కుమారుడి మృతిపై తమకు గానీ, తమ కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి తండ్రి పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కడెం సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తుమ్మలపల్లి శ్రీహరి తెలిపారు.