హరీశ్ అడ్డాలో కవిత ఎంట్రీ..కొత్త గేమ్!

10-11-2026 | 12:03pm

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 13న సిద్ధిపేటలో పర్యటించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న కవిత.. బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలో అడుగుపెట్టనుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో హరీశ్‌రావు రాజకీయ కంచుకోటలో కవిత పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి రేపుతోంది.

ఈ నెల 13న ఉదయం 9 గంటలకు సిద్ధిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా సమీపంలో నిర్మించనున్న తెలంగాణ రక్షణ సేన జిల్లా పార్టీ కార్యాలయానికి కవిత భూమిపూజ (Foundation Ceremony) చేయనున్నారు. రాష్ట్రంలోనే తొలి టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ఈ విషయాన్ని పార్టీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు లోక రవిచంద్ర వెల్లడించారు. కవిత పర్యటన కోసం పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.

సిద్ధిపేట అంటేనే బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు రాజకీయ ప్రాబల్యం గుర్తుకొస్తుంది. చాలాకాలంగా ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి ప్రాంతంలో కవిత తన పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ కవిత సిద్ధిపేట, చింతమడక ప్రాంతాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటనపై ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి: సీఎంకు అపోలో టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్

తెలంగాణ రక్షణ సేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా కవిత ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధిపేటలో జిల్లా కార్యాలయం ఏర్పాటు ద్వారా పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తున్నారు. స్థానికంగా కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, పార్టీకి ప్రజల్లో ఆదరణ పెంచుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.

అయితే కవిత పర్యటన కేవలం పార్టీ కార్యాలయ నిర్మాణానికే పరిమితమవుతుందా? లేక సిద్ధిపేట రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారా? అన్న చర్చ మొదలైంది. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేనకు ఎలాంటి స్పందన లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

నవంబర్ 13న జరగనున్న కవిత పర్యటనతో సిద్ధిపేట రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేవనుంది. ఇది పార్టీ విస్తరణ కార్యక్రమంగానే మిగులుతుందా? లేక భవిష్యత్తులో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలుకుతుందా? అన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు