ఇస్కాన్‌లో ఏడు రోజుల భాగవత మహోత్సవం
ముకరంపుర, నవంబర్ 10 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని ఇస్కాన్ శ్రీ రాధా గోవింద మందిరంలో ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు ‘శ్రీమద్ భాగవత కథామృతం’ పేరుతో భాగవత ప్రవచనాలు (Bhagavata Discourses) నిర్వహించనున్నట్లు ఇస్కాన్ కరీంనగర్ మందిర నిర్వాహకులు నరహరి ప్రభుజీ తెలిపారు. మంగళవారం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వారోత్సవాల్లో గోవర్ధన పూజ (Govardhan Puja), గోపాష్టమి, గోమాత పూజ, భజనలు, సంకీర్తనలు, మహా ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కార్తీక మాసం ప్రారంభ వేళ నిర్వహిస్తున్న ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాధా గోవిందుల ఆశీస్సులు పొందాలని కోరారు.ఇస్కాన్ మందిర కమిటీ బాధ్యులు కన్న కృష్ణ, డాక్టర్ ఎల్. రాజభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా భాగవత సప్తాహం (Bhagavata Saptaham) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి ప్రవచనాలు, దీపారాధనలు (Deepa Aradhana) జరుగుతాయని వివరించారు.
ఈ సమావేశంలో కరీంనగర్ ఇస్కాన్ శ్రీ రాధా గోవింద మందిర నిర్మాణ కమిటీ కో-చైర్మన్లు తుమ్మల రమేష్ రెడ్డి, డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, రాళ్లబండి గోపాల్ రెడ్డి, ఇస్కాన్ మందిర భక్తులు పాల్గొన్నారు.