బుకర్ ప్రైజ్ విజేతగా వృద్ధ రచయిత

10-11-2026 | 12:45pm

81 ఏళ్ల వయసులో బుకర్ విజయం.. రచయిత సరికొత్త రికార్డు!

లండన్: వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపించారు బ్రిటన్‌కు చెందిన రచయిత ఎం. జాన్ హారిసన్(British author M. John Harrison). 81 ఏళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక 2026 బుకర్ ప్రైజ్‌(Booker Prize 2026)ను కైవసం చేసుకుని సాహిత్య ప్రపంచంలో చరిత్ర సృష్టించారు. ఆయన రచించిన సైన్స్ ఫిక్షన్ నవల 'ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్'(The End of Everything) ఈ ఏడాది పురస్కారానికి ఎంపికైంది. దీంతో బుకర్ చరిత్రలో అత్యధిక వయసులో అవార్డు అందుకున్న రచయితగా హారిసన్ నిలిచారు. ఆయనకు 50 వేల పౌండ్ల నగదు బహుమతి లభించింది.

వినూత్న కథాంశంతో విజేతగా..

హారిసన్ రాసిన 13వ నవల ఇది. కేవలం 198 పేజీల్లో రూపొందిన ఈ రచన భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కొనే విపత్కర పరిస్థితులను ఆవిష్కరిస్తుంది. ఓ గుర్తుతెలియని విపత్తుతో సమాజ వ్యవస్థలు కుప్పకూలడం, యూరప్ ఉనికి ప్రశ్నార్థకంగా మారడం, మనుషుల రూపాలను అనుకరించే గ్రహాంతర జీవుల ప్రవేశం వంటి అంశాలతో కథ సాగుతుంది.

ఏఐ, ప్రపంచ సంక్షోభాలపై చర్చ..

కృత్రిమ మేధస్సు, కొవిడ్, బ్రెగ్జిట్, ఆర్థిక సంక్షోభం, ఆధునిక సాంకేతికత ప్రభావం వంటి సమకాలీన అంశాలను రచయిత కథలో మేళవించారు. సంక్షోభాల మధ్య కూడా మనిషి తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తాడనే ప్రశ్నను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ వినూత్న రచనను ఐదుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.

163 నవలలతో పోటీ..

2026 బుకర్ ప్రైజ్ కోసం మొత్తం 163 నవలలను న్యాయనిర్ణేతలు పరిశీలించారు. ప్రముఖ చరిత్రకారిణి మేరీ బియర్డ్(Prominent Historian Mary Beard) నేతృత్వంలోని బృందం తుది జాబితాలోని ఆరు రచనల్లో హారిసన్ నవలను విజేతగా ప్రకటించింది. సైన్స్ ఫిక్షన్ సాహిత్యానికి బుకర్ పురస్కారం దక్కడంలోనూ ఈ విజయం ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు