29వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె
సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఉద్యోగుల విజ్ఞప్తి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్య శాఖ(Health Department)లో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (National Health Mission) ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. మంగళవారంతో సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ తమ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, 60 ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరుతున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, రాతపూర్వక హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మెకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.