రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు..

05-11-2026 | 06:42pm
  1. ఢీకొన్న ద్విచక్ర వాహనం 
  2. ఇంటర్నల్ బ్లీడింగ్‌తో ఆసుపత్రిలో చేరిక 
  3. మూత్రవిసర్జనకు బయటకు వెళ్లడంతో చోటుచేసుకున్న ఘటన 
  4. బాధ్యత ఎవరు వహిస్తారంటున్న విద్యార్థి సంఘాలు

పాపన్నపేట,నవంబర్05: కళాశాలకు వెళ్లిన విద్యార్థి రోడ్డు ప్రమాదానికి(Road accident) గురై తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం మండల కేంద్రమైన పాపన్నపేటలో(Papannapet) చోటుచేసుకుంది. మల్లంపేట రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ అనే ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థికి(BiPC student) తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

నార్సింగి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ పాపన్నపేట ప్రభుత్వ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల సమయంలో మూత్రవిసర్జన నిమిత్తం మల్లంపేట రహదారి వైపు వెళ్లిన దుర్గాప్రసాద్ కళాశాలకు తిరిగి వెళుతుండగా ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో వెంటనే కళాశాల అధ్యాపకులు అతడిని పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

వైద్య పరీక్షల్లో విద్యార్థికి అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ బ్లీడింగ్) అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కళాశాల సమయాల్లో విద్యార్థుల భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థుల కదలికలపై పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు