హైదరాబాద్‌కు మరో గుర్తింపు

05-11-2026 | 06:01pm

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ హబ్‌(Global Space Tech Hub)గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ముఖ్యంగా అంతరిక్ష సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కాస్మోసర్వ్ సంస్థ కార్యాలయం(Cosmoserve Office) ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వర్చువల్‌గా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

అంతరిక్షంలో పెరుగుతున్న శాటిలైట్లు..

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. అనేక దేశాలు తమ అవసరాల కోసం శాటిలైట్లను(Satellite) కక్ష్యలోకి పంపుతున్నాయని తెలిపారు. రాబోయే పదేళ్లలో అంతరిక్షంలోని శాటిలైట్ల సంఖ్య 10 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.

అయితే శాటిలైట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అంతరిక్ష వ్యర్థాల సమస్య(Problem of Space Debris) కూడా తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. వాటి వల్ల భవిష్యత్తులో అంతరిక్ష కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరుపయోగంగా మారిన శాటిలైట్లను కక్ష్యల నుంచి తొలగించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు కొత్త టెక్నాలజీ!

కాస్మోసర్వ్ సంస్థ అంతరిక్షంలో నిరుపయోగంగా మారిన వస్తువులను తిరిగి తీసుకొచ్చే సాంకేతికత అభివృద్ధిపై పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఇలాంటి ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక స్పేస్ టెక్నాలజీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.

ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక స్పేస్ టెక్ పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా స్పేస్ సిటీ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. తద్వారా అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలకు తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు