మహిళలకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చారా?

05-11-2026 | 06:39pm

హైదరాబాద్‌: నగరంలో వెలుగుచూసిన అండాల అక్రమ సేకరణ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మహిళల నుంచి అండాలను సేకరించే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారా? వారికి వైద్యుల పర్యవేక్షణ లేకుండా హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చారా? అనే అనుమానాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వ్యభిచార రాకెట్‌కు సంబంధించిన కేసును విచారిస్తున్న క్రమంలో అండాల సేకరణ వ్యవహారం బయటపడిందని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి(Malkajgiri CP Sumathi) వెల్లడించారు.

ఎగ్ డొనేషన్ పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయా అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళలకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరించారా అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సీపీ తెలిపారు. ఈ వ్యవహారంలో ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఇంజెక్షన్లకు సంబంధించిన నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)కి పంపించినట్లు పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందిన తర్వాత ఇంజెక్షన్ల వినియోగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

ఈ వ్యవహారంలో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) కేంద్రాల ద్వారా బాధిత మహిళలను సంప్రదించి ఉంటారనే అనుమానాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సంబంధిత కేంద్రాలు లేదా వ్యక్తులందరినీ నిందితులుగా పరిగణించలేమని సీపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలు, బాధితుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఈ సున్నితమైన వ్యవహారంలో దర్యాప్తు ఫలితాలు కీలకంగా మారనున్నాయి.

మరిన్ని వార్తలు