మంత్రి, పురోహితుల లక్షణాలు
పాలకుర్తి రామమూర్తి :
బ్రాహ్మణేనైధితం క్షత్రం
మంత్రిమంత్రాభిమంత్రితం
జయత్యజితమత్యంతం
శాస్త్రానుగమశస్త్రితం!
(కౌటిలీయం 1-9)
గుణ సంపన్నుడైన పురోహితుడి చేత వృద్ధి పొందబడిందీ, మంత్రి యొక్క మంతనం అనే మంత్రం చేత పవిత్రీకృతమైనది, అయిన దండనీతిని అనుసరించడం అనే శాస్త్రాన్ని ధరించిన క్షత్రియకులం మిక్కిలి అభివృద్ధి చెందుతుంది. దానిని ఎవరూ జయించలేరు.. అంటాడు ఆచార్య చాణక్య(Acharya Chanakya). రాజతంత్రం, రాజనీతి శాస్త్రంలో(Political Science) నిపుణుడైన రాజు మంత్రాంగానికి తగిన దూతను ఎన్నుకునే ప్రక్రియ అత్యంత ముఖ్యమైనది. రాజతంత్ర రహస్యంలో రాజు(Raju) అత్యంత ముఖ్యమైన కార్యానికి తన మంత్రుల నుండి కాని, పురోహితుల నుండి కాని దూతను ఎన్నుకోవాలని చాణక్య అభిప్రాయం.
రాజ్యపాలనలో క్షత్రియ బలం ఒక్కటే సరిపోదని, దానికి పురోహితుని మార్గదర్శకత్వం, మంత్రి యొక్క మంత్రాంగ నైపుణ్యం, శాస్త్రానుసరణ కూడా తోడవ్వాలని సూచిస్తున్నాడు.. చాణక్య. పురోహితుడు ధార్మిక శాస్త్రగత మార్గదర్శన చేస్తాడు. ఆలోచన, సంప్రదింపులు, వ్యూహరచనల ద్వారా మంత్రి కార్యసిద్ధికై యత్నిస్తాడు. శాస్త్రానుసరణ ద్వారా రాజు అధికారాన్ని నియమబద్ధంగా, వివేకంతో వినియోగించడం జరుగుతుంది.
మంత్రాంగమనేది అయిదు అంగాలతోకూడి ఉంటుంది. నిర్ణీతకార్యాన్ని ఆరంభించడానికి అనువైన ఉపాయాన్ని నిర్ణయించడం, అంగబలాన్నీ అర్థబలాన్నీ అంచనా వేసుకోవడం, లోతుగా దేశకాల విభాగ వివేచనను చేయడం, కార్యసాధనలో ఎదురయ్యే అవరోధాలను, విఘ్నాలను ఊహించి వాటికి ప్రతి క్రియలను చేయడం, లక్షించిన కార్యాన్ని సాధించి ఫలితాన్ని పొందడం అనేవి అయిదు అంగాలుగా చెపుతారు. వీటిని రాజనీతిలో చతురుడైన రాజు నైపుణ్యంతో నిర్వహిస్తాడు, అంటారాయన. నీతి శాస్త్రవేత్తయైన రాజు చిన్నదేశానికి అధినేతయైనా సమస్త భూమినీ జయించి తీరుతాడని చెపుతాడు, చాణక్య (6-1). భారతంలో ధర్మరాజు అయిదూళ్ళిచ్చినా చాలునని అడగడం పరిశీలిస్తే ఈ చాణక్య బోధిత రాజనీతి శాస్త్రం స్ఫురణకు వస్తుంది.
ఈ అయిదు అంగాలనూ ఆధునిక నిర్వహణారీతికి అన్వయించుకుంటే.. కార్యప్రణాళిక (ఏ లక్ష్యాన్ని ఏ మార్గంలో సాధించాలో నిర్ణయించడం) వనరుల అంచనా (మానవ వనరులు, ఆర్థిక వనరులు, సంస్థాగత సామర్థ్యాలను అంచనా వేయడం) దేశకాల వివేచన (పరిస్థితులకు, సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం) ప్రమాద నిర్వహణ (అవరోధాలను ముందుగా గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలను సిద్ధం చేసుకోవడం) ఫలితాల సాధన (నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించి, ఫలితాన్ని పరిశీలించడం, అంచనా వేయడం)గా భావించవచ్చు.
పాలకులు రాజ వ్యవహారాలను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ, అనుమేయంగానూ చక్కదిద్దవలసి ఉంటుంది. తాను స్వయంగా చూసింది ప్రత్యక్షం, ఇతరుల ద్వారా తెలుసుకున్నది పరోక్షం, పూర్తి అయిన దానిని బట్టి పూర్తి కావలసిన దానిని ఊహించడమనేది అనుమేయం. నిజానికి రాజ్యపాలనలో చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి. అవన్నీ ముఖ్యమైనవి, తత్క్షణం నిర్వహించవలసినవి కావచ్చు.
అవి కూడా వేరువేరు ప్రదేశాలలో ఉండవచ్చు. అప్పుడు రాజు ఒక్కడే ఆ కార్యాలన్నీ నిర్ణీత సమయంలో చక్కదిద్దలేడు. అలా చక్కదిద్దగలనని అనుకోవడమూ రాజుకు తగదు కూడా. అలాంటప్పుడు సమర్థుడైన మంత్రిని ఆ కార్యనిర్వహణకు నియోగించాలి. దానితో పరోక్షములైన పనులన్నీ దేశము, కాలము మించిపోకుండా నిర్వహింపబడతాయి.
ఆధునిక సంస్థల నిర్వహణలోనూ నిర్ణయాలు తీసుకోవడానికి నాయకునికి సరైన సమాచారం ఎంతో అవసరం. క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించడం (ప్రత్యక్షం), సంబంధిత అధికారుల ద్వారా నివేదికలు పొందడం (పరోక్షం), అందుబాటులో ఉన్న గణాంకాలు, గత అనుభవాలను, ఫలితాలను విశ్లేషించి నిర్ధారణకు రావడం (అనుమేయం).. ఇవి కార్యనిర్ణయ ప్రక్రియలో ముఖ్యమైన దశలు.
ప్రతి విషయాన్నీ ఉన్నతాధికారే స్వయంగా పరిశీలించాలనుకోవడం వల్ల కార్యనిర్వహణలో ఆలస్యం జరగవచ్చు. అందువల్ల అవసరమైన కొన్ని బాధ్యతలను సమర్థులైన వారికి అప్పగిస్తూ, అవసరమైన సమాచారాన్ని సకాలంలో పొందుతూ, తగిన పర్యవేక్షణను కొనసాగించడం ప్రభావవంతమైన నిర్వహణా దక్షతను తెలుపుతుంది. చాణక్య సూచించిన ప్రత్యక్ష, పరోక్ష, అనుమేయ విధానాలు కార్యనిర్ణయ ప్రక్రియలో మార్గదర్శకంగా నిలుస్తాయి.
మంత్రిని నియమించుకోవడంలో అతని అర్హతలను చెపుతున్నాడు, చాణక్య. మంత్రి అభ్యర్థి తన దేశానికి చెందినవాడై ఉండాలి. అర్థశాస్త్రంలో పండితుడై ఉండాలి. సహజ బుద్ధి సంపన్నుడు, జ్ఞాపకశక్తి, పట్టుదల కలవాడు, సమర్థుడు, వాక్చాతుర్యం కలిగినవాడు, సమయస్ఫూర్తి కలిగినవాడు ఉత్సాహమూ, ధైర్యము కలవాడు, ప్రభుశక్తి (ఇతరులను నియంత్రించగల శక్తి) కలవాడు కావాలి. ఇతరులను నియంత్రించడం అంటే.. తోటివారి సామర్థ్యాలను సమన్వయపరచి లక్ష్యసాధనకు నడిపించడంగా భావించాలి.
అలాగే కష్టాలను సహించగలవాడు, స్నేహశీలుడు, ప్రభువు పట్ల, దేశము పట్ల భక్తి కలవాడు, శీలవంతుడు, ఆరోగ్యవంతుడు, చాపల్యం లేనివాడు, అందరినీ ఆకట్టుకోగలిగిన వాడు, అనవసర తగాదాలు సృష్టించని వాడు, అవసరమైన చోట సాహసాన్ని ప్రదర్శించే వాడు ఉత్తమునిగా నిర్ణయించి మంత్రిగా నియమించుకోవాలని చాణక్య చెపుతున్నాడు.
ఈ గుణాలలో మూడు వంతులు ఉన్నవాడిని మధ్యమునిగానూ, సగం మాత్రమే ఉన్న వాడు అధమునిగానూ చెపుతున్నారాయన. భారతంలో ధృతరాష్ట్రుని సభలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన సంజయుడు, మంత్రిగా వ్యవహరించిన విదురుడు అలాంటి లక్షణాలను కలిగి కార్యనిర్వహణ చేసారు.
ఆధునిక నిర్వహణలో కూడా సంస్థలలో ఉన్నతాధికారిని ఎంపిక చేసేటప్పుడు వారి విద్యార్హత ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకోరు. అభ్యర్థి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఇతరులతో వ్యవహరించే తీరు, ఒత్తిడిలో స్థిరంగా ఉండడం, సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
అలాగే ఉత్తమ పురోహితుని లక్షణాలను చెపుతున్నారాయన. శీలవంతుడు, వేదవేదాంగాలను, జ్యోతిషాది శాస్త్రాలనూ బాగా చదివినవాడు, శకునాదులను తెలిసినవాడు, దండనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు, దైవం వలన, మానవుల వలన కలిగే ఆపదలను తొలగించగల అధర్వవేదాన్ని, ప్రయోగాదుల రహస్యాలను తెలిసినవాడు, అన్ని ప్రయోగాలకూ ప్రతి క్రియలను చేయగలవాడు పురోహితునిగా ఉన్న రాజు శత్రువులపై విజయాన్ని సాధించగలడని చెపుతున్నాడు, చాణక్య. ఆధునికంగా చెప్పుకుంటే పురోహితుడిని నాయకునికి నైతిక మార్గదర్శకుడు, శాస్త్రజ్ఞుడు, సలహాదారుగా భావించవచ్చు.
భారతంలో పాండవులకు ధౌమ్యుడు అలాంటి పౌరోహిత్యం నెరిపాడు. అలాగే ఉద్యోగపర్వంలో ద్రుపదుని పురోహితుడు ధృతరాష్ట్రుని వద్ద అలాంటి దౌత్యాన్నే నిర్వహించాడు.
దౌత్య నిర్వహణ లేదా అత్యంత ముఖ్యమైన కార్యనిర్వహణలో నియోగింపబడిన మంత్రి చేసే ప్రమాదకరమైన తప్పిదాలు ఫలితంపై ప్రభావాన్ని చూపవచ్చు. ముఖ్యంగా నిర్లక్ష్యం, పిరికితనం, తొందరపాటు, గౌరవం కోసం తాపత్రయపడడం, తనవారి కోసం అతిగా ఆరాటపడడం.. వీటివల్ల తాను ప్రమాదంలో ఇరుక్కోవడం, ఫలితాలు తారుమారవడమే కాక విధ్వంసం కూడా జరగవచ్చు. తాను కూడా వ్యక్తిగతంగా అవమానాల పాలుకావచ్చు.
వ్యక్తికి సామర్థ్యం ఉండటం ఒక ఎత్తయితే, ఆ సామర్థ్యాన్ని సరైన సమయంలో, సరైన పద్ధతిలో వినియోగించడం మరొక ఎత్తు. కార్యనిర్వహణలో ఏమరుపాటు లేదా ప్రమత్తత విజయావకాశాలను ప్రభావితం చేయవచ్చు. ఆత్మీయ మిత్రుడని అతిగా విశ్వసించినా, ఆ మిత్రుడే శక్తిని పెంచుకొని శత్రువుగా మారే అవకాశాన్ని విస్మరించకూడదు అంటాడు, చాణక్య నీతిలో. అందువల్ల పాలకులు సదా అప్రమత్తంగా ఉండడం అవసరమని చాణక్యుని సూచన.