దేవుడు తెలంగాణకు నీళ్లు పంపిస్తే.. అడ్డంపడ్డ పూజారి

28-10-2026 | 05:45am

ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువు 

నవంబర్ 11న నిర్మల్‌లో బీఆర్‌ఎస్ సభ 

చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది 

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష: కేటీఆర్

అక్టోబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణలో కరువు పరిస్థితులు ప్రకృతి వల్ల మాత్రమే ఏర్పడినవి కావని, నీటి నిర్వహణలో(Water Management) ప్రభుత్వ వైఫల్యమే ప్రధా న కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. కాళేశ్వరం పంపులు(Kaleshwaram pump) ఆన్ చేస్తే ప్రాజెక్టుపై ఇంతకాలం చేసిన ఆరోపణలు తప్పని తేలిపోతాయనే భయంతోనే బటన్ నొక్కడం లేదని దుయ్యబట్టారు. దేవు డు తెలంగాణ ప్రజల కోసం నీళ్లు పంపిస్తే, మధ్యలో పూజారి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అడ్డుపడి బటన్ నొక్కకుండా అడ్డుకున్నారని వ్యంగ్యం గా వ్యాఖ్యానించారు.

నవంబర్ 11న నిర్మల్‌లో(Nirmal) భారీ బహిరంగ సభ నిర్వహించనున్న ట్టు కేటీఆర్ ప్రకటించారు. నిర్మల్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రామచరణ్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని, యువ నాయకులు అనిల్ జాదవ్, జాన్సన్ రాథోడ్ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సభలో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు తగిన బాధ్యతలు అప్పగించే అంశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరా రు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని ఎప్పుడు చేసు కుందామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని అన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలు వ తెలుస్తుందని, గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. 

ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి తన వైఫల్యాలతో ప్రజల నెత్తిన రుద్దిన కరువని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నదుల్లో నీళ్లు పారుతున్నా వాటిని సాగుకు వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని, అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాలు అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన నాయకులు, ఇప్పుడు వాటి అమలుపై ప్రశ్నిస్తే తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు.

హామీల అమలుపై ప్రశ్నిస్తే మూడు నెలల్లో పిల్లలు పుడతారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని కేటీఆర్ విమర్శించారు. మూడు నెలల్లోనే అన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ తెచ్చిన కరువు..

గోదావరి, కృష్ణా నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారని విమర్శించారు. జూన్ 19, 2026న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించినప్పుడు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోందని, పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వాన్ని కోరామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ నీటిని వినియోగించుకుని ఉంటే కోటి ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని అన్నారు. ఒకవైపు పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రైతుబంధు సకాలంలో అందడం లేదని, కరెంటు, యూరియా, సాగునీటి సమస్యలు మరింత తీవ్రంగా మారాయని పేర్కొన్నారు.

రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన సీఎం ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. నెలనెలా ఢిల్లీకి వెళ్లి ఈఎంఐ కట్టడానికే సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఈఎంఐ కడితేనే ముఖ్యమంత్రి పదవి మళ్లీ రెన్యువల్ అవుతుందంటూ విమర్శించారు. రైతులకు రైతుబంధు పడకపోయినా, రాహుల్ బంధు మాత్రం సమయానికి అందుతోందని వ్యంగ్యంగా అన్నారు.

తెలంగాణ దోపిడీకి వేదికగా మారింది..

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దోపిడీ వేదికగా మారిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి ఢిల్లీ నాయకత్వాన్ని సంతృప్తిపరచడంపైనే సీఎం దృష్టి పెట్టారని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ ప్రజలను విభజించడంలో బిజీగా ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను దోచుకోవడంలో బిజీగా ఉందని వ్యాఖ్యానించారు. నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గొడం నగేష్ గెలిచినా నియోజకవర్గానికి ఏమి సాధించారని ప్రశ్నించారు.

నిర్మల్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, చెక్‌డ్యాములు, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం కోల్పోగానే పార్టీని వీడారని విమర్శించారు. అవకాశవాదులు పార్టీని వీడినా, పోరాటవాదులు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ మళ్లీ గట్టెక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ సమయం లేదని, మరో ఏడాదిలో రాజకీయ పరిస్థితులు మారుతాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మళ్లీ అభివృద్ధి, సంక్షేమ బాటలోకి వస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు