జయేష్ రంజన్ వీఆర్ఎస్కు దరఖాస్తు?
బ్యూరోక్రసీలో సంచలనం
గత ప్రభుత్వంలో కీలక పాత్ర.. కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు
- కాంగ్రెస్ హయాంలో ప్రాధాన్యం కరువు
- ఆశించినా దక్కని సీఎస్ పదవి
- అసంతృప్తితోనే ఈ నిర్ణయమని వాదన
అక్టోబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ బ్యూరోక్రసీలో(Telangana Bureaucracy) సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్(Senior IAS Jayesh Ranjan) వీఆర్ఎస్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. 2027 సెప్టెంబర్‌లో పదవీ విర మణ చేయాల్సి ఉండగా, అంతకంటే ముందుగానే ప్రభుత్వ సేవలకు స్వస్తి పలకాలని ఆయన భావిస్తున్నట్లు సమాచా రం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS government) హయాం లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో(KTR) సమన్వయంతో పనిచేసిన అధికారిగా గుర్తింపు పొందిన జయేష్ రంజన్‌కు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న స్థాయిలో ప్రాధా న్యం దక్కలేదనే చర్చ అధికారవర్గాల్లో వినిపిస్తోంది.
ఒకప్పుడు రాష్ట్రానికి పెట్టుబ డులు తీసుకురావడం, ఐటీ రంగం విస్తరణ, అంతర్జా తీయ సంస్థలతో సంబంధాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ దిశగా అడుగులు వేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారానికి ప్రాధాన్యం సంతరించుకుంది. జయేష్ రంజన్ నిర్ణయం వెనుక కేవలం ప్రైవేటు రంగంలో(Private sector) ఉన్నతస్థాయి అవకాశం మాత్రమే ఉందా? లేక మారిన ప్రభుత్వంలో తన పాత్ర, బాధ్యతలు, భవిష్యత్తు అవకాశాలపై ఉన్న అంచనాలు కూడా ప్రభావం చూపాయా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి(సీఎస్) పదవికి ఆయన పేరు కూడా పరిశీలనలో ఉందని గతంలో ప్రచారం జరగడం, చివరకు ఆ పదవి ఆయనకు దక్కకపోవడం ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి రంగాల్లో జయేష్ రంజన్ కీలక బాధ్యతలు నిర్వహించారు. అప్పటి మంత్రి కేటీఆర్‌తో కలిసి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థలతో సమావేశాలు, ఐటీ రంగ విస్తరణకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పనిచేశారు.
తెలంగాణను ఐటీ, స్టార్టప్‌లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వ యంత్రాంగం తరఫున ఆయన అనుభవం ఉపయోగపడింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పాలనలో ఆయనకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండేదనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఏర్పడింది. అందుకే జయేష్ రంజన్‌కు ప్రాధాన్యం దక్కలేదన్న వాదన వినిపిస్తోంది.
కాంగ్రెస్ వచ్చాక..
2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనా యంత్రాంగంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. కీలక శాఖల బాధ్యతలు, అధికారుల పోస్టింగులు, ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం విధుల పునర్విభజన జరిగింది. ఈ క్రమంలో జయేష్ రంజన్ కూడా పలు మార్పులను ఎదుర్కొన్నారు. 2025 ఏప్రిల్‌లో ఆయనను ఐటీ, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి మార్చి, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ బాధ్యతలు అప్పగించారు.
అనంతరం 2025 డిసెంబరులో హెచ్ఎండీఏ విభాగానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ మార్పులు ప్రభుత్వ పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరిగాయి. అయితే గతంలో ఐటీ, పరిశ్రమల రంగంలో నేరుగా కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారి ఇతర విభాగాలకు మారడం వల్ల ఆయన పాత్రపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తనకు గతంలో ఉన్న ప్రాధాన్యం తగ్గిందనే అభిప్రాయం ఆయనలో ఏర్పడిందని కొందరు అధికార వర్గాల్లో చెప్పుకుంటున్నప్పటికీ, 2026 జూన్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియామకంపై చర్చ జరిగిన సమయంలో జయేష్ రంజన్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.
ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో అనుభవం ఉండటంతో ఆయనకు ఆ అవకాశం దక్కవచ్చనే అంచనాలు అధికార వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అయితే చివరకు ప్రభుత్వం సంజయ్ జాజును ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ పరిణామం జయేష్ రంజన్ భవిష్యత్తు బాధ్యతలపై చర్చకు దారితీసింది. ప్రధాన కార్యదర్శి పదవి ఐఏఎస్ అధికారులకు అత్యున్నత పరిపాలనా బాధ్యతల్లో ఒకటి. అయితే సీఎస్ పదవి ఆశించారని, అది దక్కకపోవడంతోనే ఆయన అసంతృప్తికి గురైనట్టు అప్పట్లో చర్చ జరిగింది.
అయితే ప్రస్తుతం జయేష్ రంజన్ వీఆర్ఎస్ తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారనే సమాచారంతో ఈ చర్చకు మరింత ఊతమిస్తున్నాయి. ఆయనకు ఇంకా సుమారు పది నెలల సర్వీసు మిగిలి ఉండగా, ముందుగానే ప్రభుత్వ సేవలకు స్వస్తి పలకాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఉన్నతస్థాయి బాధ్యతలు దక్కినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఏఎం. రిజ్వీ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసిన నేపథ్యంలో, జయేష్ రంజన్ వ్యవహారం కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల భవిష్యత్తు అవకాశాలపై చర్చను పెంచింది.
బీఆర్ఎస్ మళ్లీ వస్తే తిరిగి వస్తారా?
జయేష్ రంజన్ వీఆర్ఎస్ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే, ఆయన తిరిగి ప్రభుత్వ వ్యవస్థలో కీలక బాధ్యతలు చేపడతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఆయన నిర్వహించిన బాధ్యతలు, కేటీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉండగా జయేష్ రంజన్ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ బ్యూరోక్రసీలో ఒక విస్తృతమైన ప్రశ్నను ముందుకు తెస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడు అధికారుల బాధ్యతలు మారడం సహజమే.
అయితే గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అనుభవజ్ఞులైన అధికారులను కొత్త ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటుంది? వారి అనుభవాన్ని కొత్త విధానాలు, ప్రాజెక్టుల అమలులో ఎంతవరకు ఉపయోగించుకుంటుంది? అనే అంశాలు పరిపాలనా వ్యవస్థ పనితీరుతో ముడిపడి ఉంటాయి. జయేష్ రంజన్ విషయంలో గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు, కాంగ్రెస్ హయాంలో జరిగిన బదిలీలు, సీఎస్ పదవికి సంబంధించి వచ్చిన ప్రచారం, ఇప్పుడు ముందస్తు పదవీ విరమణ యోచన వంటి అంశాలు చర్చకు దారితీస్తున్నాయి.
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక విస్తరణ, ఐటీ రంగం అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగాల్లో అనుభవం ఉన్న సీనియర్ అధికారి వైదొలిగితే, ఆ బాధ్యతలను ఎవరు చేపడతారు? ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులు, పెట్టుబడిదారులతో సంబంధాలు, విధానపరమైన నిర్ణయాల అమలుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే అంశాలు ముందుకు వస్తాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జయేష్ రంజన్ 2027 సెప్టెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది.
దాదాపు పది నెలల ముందుగానే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసినట్లు సమాచారంతో ఈ దరఖాస్తుపై సంబంధిత అధికారుల పరిశీలన, వర్తించే సర్వీసు నిబంధనలు, అవసరమైన అనుమతులు కీలకంగా మారనున్నాయి. వీఆర్ఎస్కు అనుమతి లభిస్తుందా? ఆయన నిజంగానే అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థలో బాధ్యతలు చేపడతారా? రాష్ట్ర ప్రభుత్వం ఆయన బాధ్యతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. మొత్తంగా జయేష్ రంజన్ వీఆర్ఎస్ వ్యవహారం తెలంగాణ బ్యూరోక్రసీలో ఆసక్తికరమైన పరిణామంగా మారింది.