నషా ముక్త్ యువ భారతం!

28-11-2026 | 05:00am

‘మత్తు’ ఈ రెండక్షరాల పదం నేడు దేశ యువక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ వెలుగొందుతోంది. కానీ, అదే యువత దేశానికి అండగా నిలవాల్సింది పోయి మత్తుకు బానిసవుతుండటం కలవరపెడుతోంది. దేశ ప్రగ తిలో కీలకపాత పోషించాల్సిన యువత.. నేడు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల(Drug Addiction Crisis) ఉచ్చులో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకోవడం ఆందోళనకరం.

ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైందనుకున్న ఈ విష సంస్కృతి.. నేడు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. చివరికి పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లోకి సైతం ప్రవేశించడటం సమా జానికి పెను సవాలుగా మారింది. చదువుకున్నవారు, నిరక్షరాస్యులతో పాటు మైనర్లు కూడా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. దీని వల్ల సమాజంలో ఊహించని నేరా లు, అవాంఛనీయ సంఘటనలు చోటు  చేసుకుంటున్నాయి.

యువత మత్తుకు బానిసలవ్వడానికి ప్రధానంగా నిరుద్యోగం, మానసిక ఒత్తిడి, తప్పుడు స్నేహాలు, సోషల్ మీడియా ప్రభావం కారణమవుతున్నాయి. ఆధునికత పెరుగుతున్న కొద్దీ మనిషి సహజ జీవనశైలి పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా యువత ఆలోచనా విధానమే మారిపోతోంది. క్షణికానందం కోసం అలవాటుగా మొదలైన ఈ వ్యసనం క్రమంగా వారి ఆలోచనా శక్తిని, ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది. దీని ఫలితంగా వారి వ్యక్తిగత జీవితాలతో పాటు, వారి కుటుంబాల పరిస్థితి కూడా చిన్నాభిన్నమవుతోంది. అంతేకాకుండా, మత్తు వలలో చిక్కుకున్న యువత ప్రవర్తన సమాజంలో శాంతిభద్రతలకు సైతం విఘాతం కలిగిస్తోంది.

ఈ ప్రమాదాన్ని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ’నషా ముక్త్ భారత్ అభియాన్’ వంటి ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ సమస్య ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయవలసిన అవసరం ఉంది. అయితే, కేవలం పోలీసుల దాడులు, చట్టాలతోనే ఈ మహమ్మారి పూర్తిగా సమసిపోదు. డ్రగ్స్ సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠాల మూలాలను పూర్తిగా పెకిలించి వేయాలి. ముఖ్యంగా విద్యాసంస్థల పరిసరాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలి.

ఈ డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులు, ప్రభుత్వాలది మాత్రమే బాధ్యత కాదు; తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కూడా అత్యంత కీలకం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను, వారి దినచర్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ సరైన మార్గనిర్దేశం చేయాలి. పాఠశాలలు, కళాశాలల్లోనూ మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై నిరంతర అవగాహన సదస్సులు నిర్వహించాలి. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడలు, ఇతర సృజనాత్మక రంగాల వైపు ప్రోత్సాహం అందిస్తే వారు చెడు వ్యసనాల వైపు చూడకుండా ఉంటారు.

మత్తుకు బానిసలైన వారిని సమాజం నేరస్తులుగా చూడకుండా, పునరావాస కేంద్రాల ద్వారా వారికి సరైన కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలి. వారిని అవమానిస్తూ, నిందిస్తూ ఉంటే వారి ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉండదు. అందుకే, మత్తుకు అలవాటైన వారిని స్నేహపూర్వకంగా తిరిగి సాధారణ సమాజంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం సమష్టిగా కృషి చేసినప్పుడే ’నషా ముక్త్ భారత్’ కల సాకారమవుతుంది. మత్తు రహిత సమాజ నిర్మాణమే నిజమైన దేశభక్తి అని యువత గుర్తించాలి. 

సామాజిక కార్యకర్త, పెద్దపల్లి, సెల్ నం: 7670893265

అలుగువెల్లి ఉభయ్ రెడ్డి

మరిన్ని వార్తలు