ఆదర్శగురువు బాలకృష్ణ

28-11-2026 | 05:05am

నేను ప్రాచ్య విద్యాభ్యాసం చేస్తానని ఎన్నడూ అనుకోలేదు. అందరి విద్యార్థుల వలె, ప్రాథమిక పాఠశాల కొల్కులపల్లిలో చదువు ముగించుకొని ఉన్నత పాఠశాలలో చదువుకోవటానికి నల్లగొండ జిల్లా(Nalgonda district)లోని జిల్లా పరిషత్ హైస్కూల్ చింతపల్లికి వచ్చాను. ఆ పాఠశాలలో నామీద ప్రభావం చూపెట్టినవారు నల్గురున్నారు. వారిలో మధుసూదనరావు గారు సాంఘికశాస్త్రం బోధించేవారు. శ్యామలయ్యగారు ఆంగ్లం బోధించేవారు. నరసింహారెడ్డిగారు విజ్ఞాన శాస్త్రాధ్యాపకులు కాగా, ఎలిశెట్టి బాలకృష్ణగారు తెలుగు బోధించేవారు. ఈ నల్గురిలో బాలకృష్ణగారు కేవలం ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి ‘విశారద’ ఉత్తీర్ణులై తెలుగు అధ్యాపకులుగా చేరినవారు. ఇతరులు డిగ్రీతో పాటు, బి.ఇడి. చేసినవారు. 

మొదటినుంచి తెలుగులో రాయడమంటే నాకు చాలా ఇష్టం. మాట్లాడడంలో, చదవడంలో నా ప్రత్యేకత నాదే. ఇంట్లో భాగవతం ఉండటం వల్ల అన్నయ్యలు భాగవతం వినిపించడం వల్ల నాకు పోతన మీద ఎంతో అభిమానం ఏర్పడింది. భాగవతంలోని కొన్ని ప్రసిద్ధ పద్యాలు అప్ప టికే నాకు కంఠస్థమయ్యాయి. 

‘పరికెడిది భాగవతమట’ అనే పోతన పద్యానికి ఒక పేరడీ చెప్పినాను.

పలికెడిది తెలంగాణట

పలికించెడివాడు రామభద్రుండట, నే

పలికిన భవహరమగునట

పలికెద వేరొండు చరిత పలుకగనేలా”

అని నా శైలిలో చదువుకునే వాణ్ణి.

ఒకరోజు జిల్లా విద్యాధికారి మా పాఠశాలకు వచ్చి, ఏ విద్యార్థి భవిష్యత్తులో ఏయే వృత్తిలో ప్రవేశిస్తాడో చెప్పమని అడిగాడు. నేను తెలుగు పండితుణ్ణి కావాలను కుంటున్నాను అని సమాధానం ఇచ్చాను. ఆ రోజు నుంచి ఎలిశెట్టి బాలకృష్ణగారు నామీద తన ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టారు. ఆశ్చర్యకరమైన మరొక విష యం ఏమంటే నాకు సైన్సు బోధించే నరసింహారెడ్డిగారు ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించే తెలుగు పరీక్షల్లో ఉత్తీర్ణులైనారు. వారికి కూడా తెలుగంటే ఇష్టం. అప్పుడప్పుడు తెలుగు పద్యాలు చదువు తూ సైన్సు బోధించేవారు. బహుశా ఏ సబ్జెక్టు బోధించినా, అధ్యాపకులు మాతృభాషాభిమానం కల్గి ఉండాలన్న అభిప్రా యం నాకు వారి ద్వారానే కలిగింది.

ఎలిశెట్టి బాలకృష్ణగారు అలవోకగా తెలుగు పద్యాలు వినిపిస్తుంటే మా విద్యార్థులమంతా చెవియొగ్గి వినేవాళ్లం. ఐతే వారి దయాదృష్టి నామీద పడింది. నన్ను తనలాగా ఒక తెలుగు పండితుణ్ణి చేయాలని వారు సంకల్పించడం నా అదృష్టమే!

అది 1967 ప్రాంతం. బాలకృష్ణగారు అప్పటికి ఆంధ్ర సారస్వత పరిషత్తు పరీక్షల వ్యవస్థాపకులుగా ఉన్నారు. ప్రాథమిక పరీక్షకు మూడు రూపాయల ఫీజు, ప్రవేశపరీ క్షకు ఐదు రూపాయల ఫీజు చెల్లించినట్లు నాకు జ్ఞాపకం ఉంది. అట్లావారు చింతపల్లిలోనే పరిషత్తు పరీక్షలకు మాతోటి విద్యా ర్థులనెంతో మందిని కూర్చుండబెట్టినారు. కాని వారిలో బాలకృష్ణగారి అభి మానాన్ని చూరగొన్న వాణ్ణినేనే. తొమ్మిదవ తరగతి లో ఉండగానే విశారద పూర్వభాగం పరీక్షకు హాజరై, అందులో ఉత్తీర్ణుడనయ్యాను. ఆ పరీక్ష హైదరాబాదులో జరిగింది. పదవ తరగతిలో ప్రవేశించిన కారణంగా ఒక విధంగా విశారద (ఉత్తరభాగం) పూర్తి చేయాలన్న ఆలోచనే రాలేదు.

ఎండాకాలం సెలవులు వచ్చాయి. ఇంటికివచ్చి ఆటపాటల్లో లీనమయ్యాను. కాని ఒకరోజు బాలకృష్ణగారు సైకిల్‌మీద పది కిలోమీటర్లు ప్రయాణించి ఎండలో మా ఇంటికి వచ్చినారు. మా ఇంటిలో వారు మా ఆతిథ్యాన్ని స్వీకరించి, మా అన్నయ్యగారితో విశారద ఉత్తరభాగానికి ఫీజు కట్టించారు. ఎంతో కష్టస్థితిలో పదిరూపాయల ఫీజు కట్టినట్లు మా అన్నయ్య వీరయ్య గారు చెప్పారు నాతో.

ఒక విద్యార్థి చదువుకోసం ఒక అధ్యాపకుడు సెలవుల్లో ఆ విద్యార్థిని వెదు క్కుంటూ వచ్చి, పరీక్ష ఫీజు కట్టించడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. కాని ఇట్లే ఆ నాటి పరిషత్తు పరీక్షల వ్యవస్థాపకులు సాధారణంగా విద్యార్థులను పరీక్షలకు కూర్చోబెట్ట డానికి వెళ్లేవారు.

విశారద (ఉ.భా) ఫీజు కట్టనైతే కట్టానుగాని, పుస్తకాలు తెప్పించుకోవడానికి మ రో పదిరూపాయల అవసరం ఏర్పడింది. మా ఊరిలో మంచి పేరున్న సరాబు వెంకటయ్యగారు నాకు పదిరూపాయలిచ్చి సహాయపడ్డారు. వేసవి సెలవులలో మనసుపెట్టి చదవడం వల్ల విశారద (ఉ.భా)లో ఉత్తీర్ణుడ నయ్యాను. 

పదవ తరగతిలో ఉత్తీర్ణుడనైతే నల్గొండకు వెళ్లి ఇంటర్‌లో ప్రవేశం పొందాలి. కాని అంతకంటే ముందే ‘విశారద’ నన్ను విశారదున్ని చేసింది. ఎలిశెట్టి బాలకృష్ణ పుణ్యమా అని ‘విశారద’ కాగానే ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో చదవడానికి హైదరాబాదుకు వచ్చాను. కళా శాల ప్రధాన ఆచార్యులైన కె.కె. రంగనాథాచార్యులు నాకు డిప్.ఓ.ఎల్‌లో ప్రవేశం కల్పించారు. అప్పటికి డిప్.ఓ.ఎల్‌లో ప్రవే శం పొందిన వారంతా హెచ్.ఎస్సీ ఉత్తీర్ణులై వచ్చినవారే. క్లాసులో డెబ్బది మం దిమి. అందరిలో నేనే చిన్నవాడిని. అందరి దృష్టి నా మీదనే.

కళాశాలల్లో సాధారణంగా అధ్యాపకులకు విద్యార్థులందరూ సమానమే. అక్కడ విద్యార్థులే అధ్యాపకులను ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలి. ఐతే కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు విద్యార్థుల పట్ల అంతగా శ్రద్ధ చూపడానికి సమయం దొరకదు. పాఠశాలలు మాత్రమే విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది వేయగల్గినవి! నయానో, భయానో మంచిమార్గంలో విద్యార్థులను నడిపించగలిగిన బాధ్యతను తమ భుజస్కంధాలమీద వేసుకో గలిగినవారు పాఠశాల అధ్యాపకులే అని నా అభి ప్రాయం.

పరిషత్తు కళాశాలలో చదువుతున్నప్పుడుగాని, విశ్వవిద్యాలయంలో అడుగుపె ట్టిన తర్వాత గాని తెలుగుపాఠం చెప్పినప్పుడు గాని నాకు బాలకృష్ణగారే గుర్తుకు వచ్చారు.వారు పరిషత్తు పరీక్షలకు కూర్చో బెట్టనట్లుతై, నేను తెలుగులో ప్రవేశించేవాడిని కాదు. తెలుగు సాహిత్యంపట్ల ఆసక్తి, అనురక్తి కల్గి ఉండేవాడిని కాదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవ డమే గాక, నా 40 ఏళ్ల అధ్యాపక వృత్తిలో ఇరవై ఆరు సంవత్సరాలు విశ్వవిద్యాలయంలోనే పనిచేయడం నాకు గొప్ప అదృష్టం!

నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడినైన విషయం తెలిసి ఎలిశెట్టి బాలకృష్ణగారు నన్ను కలవడానికి ఆర్ట్స్ కళాశాలకు వచ్చినారు. ఆ రోజు నాకు కల్గి న ఆనందం మాటలతో చెప్పలేను. వారు తన వెంటతెచ్చిన ‘తెలుగు బిడ్డ’ శతకాన్ని నాకిచ్చి ఇది నీకంకితం అన్నప్పుడు నా కళ్ల నుంచి ఆనందాశ్రువులు జాలువారాయి. వెంటనే వారి పాదాలమీద వ్రాలిపోయాను.

ఈ సందర్భంగా ఒక విషయాన్ని తప్పక చెప్పాలి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థినైన నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా అడుగుపెట్టినందున పరిషత్తు అధ్యక్షులు దేవులపల్లి రామానుజరావుగారు కార్యవర్గసభ్యులుగా నియమించా రు. ఆ తర్వాత అధ్యక్షులుగా వ్యవహరించి న ఆచార్య సి.నారాయణరెడ్డి గారు నన్ను పరీక్షా కార్యదర్శిగా బాధ్యతలప్పజెప్పారు.

ఏ పరిషత్తు పరీక్షలు పాసై ఉన్నతస్థితికి వచ్చానో, ఆ పరిషత్తు నిర్వహించే పరీక్షలకు కార్యదర్శిని కావడం గొప్ప అవకా శంగా భావించాను. ఈ రోజు పరిషత్తు నిర్వహించే పరీక్షలకు ఆదరం తగ్గిందిగాని, పరిషత్తువారి ‘విశారద’ ఉత్తీర్ణులైనవారు ఆ కాలంలో బాలకృష్ణగారిలా ఎంతోమంది తెలుగు పండితులయ్యారు. తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేశారు.

ఆచార్య మసన చెన్నప్ప 

మరిన్ని వార్తలు