జీవిత సత్యాల అక్షర మాల !

23-11-2026 | 05:05am

కవిత్వం(Poetry) అంటే కేవలం భావాల వ్యక్తీకరణే కాదు.. జీవితాన్ని చదవడం, మనుషుల మనసులను అర్థం చేసుకోవడం, సమాజంలోని సంఘర్షణలను అక్షరాల్లో ఆవిష్కరించడం. అలాంటి జీవితానుభవాల, మానవీ య స్పందనల, సామాజిక ఆలోచనల సమాహారంగా రూపుదిద్దుకున్న కవి తా సంపుటి డా.మహమ్మద్ హసేన రచించిన ‘నువ్వే ఒక సమూహం’. ఈ సంపుటిలోని కవితలను పరిశీలిస్తే కవి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా పరిశీలిస్తూ, నిత్యజీవితంలో ఎదురయ్యే సాధారణ సంఘటనల్లోని అసాధారణమైన జీవిత సత్యాలను కవిత్వంగా మలిచిన తీరు కనిపిస్తుంది.

కుటుంబం, సమాజం, ప్రకృతి, దేశభక్తి, మానవ సంబంధాలు, ఆత్మవిశ్వాసం వంటి విభిన్న అంశాలు ఈ సంపుటిలో అంతర్లీనంగా ప్రవహిస్తాయి. అంతేకాకుండా ఈ కవిత్వంలో కుటుంబ జీవితం ఒక ప్రధాన వస్తువుగా కని పిస్తుంది. తల్లి మాతృత్వపు వేదనను, తండ్రి బాధ్యతలను, మధ్యతరగతి కుటుం బాల ఆర్థిక సంఘర్షణలను కవి అత్యంత సహజంగా చిత్రించారు. తల్లి అనుభవించే శారీరక బాధ కాలక్ర మంలో మానసిక వేదనగా మారే విషాదాన్ని వ్యక్తం చేస్తూ ‘కోలుకోవడానికి నాలుగేళ్లు పట్టింది/మళ్లీ ఇరవై ఏళ్లకు అడ్డంగా తిరుగుతున్నాడు’ అని చెప్పడం వెనుక లోతైన వ్యంగ్యం ఉంది.

అలాగే నెల జీతంపై ఆధారపడిన కుటుంబంలో తండ్రి స్థితిని ‘ఒకటో తారీఖున స్వయం ప్రకాశమైన నాన్న ముఖం/నెల చివర్లో అమావాస్య చీకటిలా అయ్యేది’ అంటూ పున్నమి, అమావాస్యలతో పోల్చడం కవి పరిశీలనా శక్తికి నిదర్శనం. ముఖ్యంగా ‘సూర్యుని చుట్టే భూ మివలె / నాన్న చుట్టూ పరిభ్రమించే / చిన్న సౌర కుటుంబం మాది’ అనే పాదాలు తండ్రి కుటుంబానికి కేంద్రబిందువనే గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ భావచిత్రం ప్రతి మధ్యతరగతి కుటుంబానికీ సన్నిహితంగా అనిపిస్తుంది. 

కాలగమనంతో పాటు మనిషి జీవితంలో కలిగే మార్పులు, ఆశలు, నిరీక్షణలు కూడా ఈ సంపుటిలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతం మిగిల్చిన గాయాలను అధిగమించి కొత్త జీవితాన్ని ఆశించే మనిషి మనస్తత్వాన్ని వ్యక్తం చేస్తూ ‘గతం గాయమై వేధించినా/రంగురంగుల క్యాలెం డర్/ఈసారైనానా జీవితానికి రంగులద్దుతుందో’ అని కవి ప్రశ్నిస్తారు. కొత్త క్యాలెండర్ రావడం కేవలం కాలమార్పు కాదు, జీవితంలోనూ ఏదో ఒక మంచి మలుపు వస్తుందనే ఆశకు ప్రతీకగా నిలుస్తుంది. ‘పన్నెండు పేజీలలో ఏదో/ఒక పేజీ జీవితాన్ని మలుపు తిప్పకపోతుందా’ అనే నిరీక్షణలో సామాన్య మానవుడి ఆశావాదం ప్రతిఫలిస్తుంది. ప్రకృతిలోని మార్పులను మానవ జీవిత పరిణామాలతో ముడిపెట్టడం కవి కవిత్వంలోని ప్రత్యేకమైన భావనా సౌందర్యం.

ఈ సంపుటిలో వ్యక్తిగత అనుభూతులతో పాటు సామాజిక బాధ్యత కూడా బలంగా కనిపిస్తుంది. దేశభక్తి, జాతీయ ఆత్మగౌరవం, ఉగ్రవాదంపై నిరసన, శాంతి పట్ల ఆకాంక్ష వంటి అంశాలను కవి తన కవిత్వంలో ప్రస్తావించారు. ‘మేం బుద్ధుడు, గాంధీజీ బోధించిన / సత్యం, అహింసలను నమ్ముతుంటాం’ అనే పాదాలు భారతీయ సంస్కృతిలోని శాంతి విలువలను గుర్తు చేస్తాయి. అదే సమయంలో ‘ముందు మీ ఇల్లు సరిదిద్దుకోండి’ అనే హెచ్చరిక ద్వారా పొరుగు దేశం తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని, ఇతరుల శాంతికి భంగం కలిగించకూడదని స్పష్టం చేస్తారు.

కవి కలం కుటుంబ గోడల మధ్యనే ఆగిపోకుండా జాతీయ సమస్యల వరకు ప్రయాణించడం ఆయన సామాజిక చైతన్యానికి నిదర్శనం. ‘నువ్వే ఒక సమూహం’ కవిత మొత్తం పుస్తకానికి తాత్విక భూమికగా నిలుస్తుంది. ఒంటరితనంతో కుంగిపోయే మనిషికి తనలోని అపారమైన శక్తిని గుర్తుచేస్తూ ‘అ నంత శూన్యంలో/అలుపెరుగక పయనించే/సూర్యుడు కూడా ఒంటరే కదూ’ అని ప్రశ్నిస్తారు.

అలాగే ‘ఒంటి దీపమే/వేల దీపాలకూ ఊపిరి పోస్తుందని మరువకు’ అనే పాదాల ద్వారా ఒంటరిగా ఉన్న వ్యక్తి కూడా తన ప్రతిభతో ఎంతోమందికి వెలుగునివ్వగలడనే గొప్ప సందేశాన్ని అందిస్తారు. ఇక ‘ఒక్కసారి నీ అంతస్స ముద్రంలోకి/నీకై నీవు పారిచూడు/ అం తుచిక్కని సవహాలెన్నో/నీ ఆజ్ఞకోసం ఎదురుచూస్తుంటాయి’ అనే ముగింపు పాదాలు మనిషిలోని అంతర్గత సామర్థ్యాలను, సృజనాత్మక శక్తిని ఆవిష్కరిస్తాయి. మనిషి తనలోకి తాను తొంగిచూస్తే ఒక ప్రపంచమే కనిపిస్తుందనే తాత్విక భావన ఈ శీర్షికకు సార్థకతను చేకూరుస్తుంది.

సరళమైన భాష.. లోతైన భావాలు

డా. మహమ్మద్ హసేన కవిత్వంలో సరళమైన భాష, సహజమైన అభివ్యక్తి ప్రధాన ఆకర్షణలు. క్లిష్టమైన పదజాలంతో పాఠకుడిని ఇబ్బంది పెట్టకుండా, సాధారణ పదాలతో గాఢమైన భావాలను పలికించడం ఆయన రచనా శైలి ప్రత్యేకత. పున్నమి-అమావాస్యలు, సూర్యుడు-చం ద్రుడు, నది-సముద్రం, దీపం వంటి ప్రకృతి ప్రతీకలు కవితలకు దశ్యాత్మకతను, భావ గాఢతను అందిస్తాయి. సందర్భానుసారంగా ఉపయోగించిన ఉపమానాలు, రూపకాలు, వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు కవిత్వానికి ప్రత్యేకమైన ఆకర్ష ణను కలిగిస్తాయి.

కొన్ని కవితల్లో ఆవేదన, మరికొన్నింటిలో ఆగ్రహం, ఇంకొన్నింటిలో ఆశావాదం, తాత్వికత కనిపించడం సంపుటిలోని భావ వైవిధ్యాన్ని తెలియజేస్తుంది.‘నువ్వే ఒక సమూహం’ కవితా సంపుటి జీవితంలోని అనేక పార్శ్వాలను స్పశిస్తూ పాఠకుడిని ఆలోచింపజేసే రచన. వ్యక్తిగత అనుభూతులను సామాజిక అనుభవాలుగా విస్తరింపజేయడం, ప్రకృతి దశ్యాల ను జీవిత సత్యాలకు ప్రతీకలుగా మలచడం, సాధారణ మనుషుల జీవితాల్లోని అసాధారణమైన భావాలను వెలికితీయడం ఈ సంపుటిలోని విశే షాలు. ఇందులో ఆవేదన ఉంది,

ఆలోచన ఉంది, సామాజిక స్పహ ఉంది, దేశభక్తి ఉంది, అన్నింటికీ మించి మనిషి పట్ల మానవీయ ధృక్పథం ఉంది. మనిషి ఒంటరిగా ఉన్నా అతనిలో ఒక సమూ హం ఉందని, జీవితంలో ఎన్ని గాయాలున్నా ఆశకు అంతం లేదని, కుటుంబం వెనుక ఎన్నో త్యాగాలున్నాయని గుర్తుచేసే ఈ కవితా సంపుటి మనిషిని మనిషిగా అర్థం చేసుకునే ప్రయత్నం. తన చుట్టూ ఉన్న జీవితాన్ని కవిత్వంగా మలిచి, పాఠకుడి అంతరంగాన్ని తట్టిలేపిన డా. మహమ్మద్ హసేన రచనా ప్రయాణంలో ‘నువ్వే ఒక సవహం’ ఒక ఆలోచనాత్మకమైన, అనుభూతిప్రధానమైన కవితా సంపుటిగా నిలుస్తుంది. జీవితాన్ని ప్రేమించే, సమాజాన్ని పరిశీలించే, కవిత్వాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమిది.

 గాజోజి శ్రీనివాస్, విశ్లేషకులు, సెల్ నం : 9948483560 

మరిన్ని వార్తలు