ఇజ్రాయెల్‌లో రాజకీయ ఊగిసలాట

23-11-2026 | 05:15am
  1. ఐజెన్‌కోట్, నెతన్యాహు మరోమారు చర్చలు?
  2. అరబ్ పార్టీల మద్దతు తీసుకుంటే నేతల రాజీనామాలు?
  3. మళ్లీ ఎన్నికలు తప్పవా?

జెరూసలెం, నవంబర్ 22: ఇజ్రాయెల్‌లో  రాజకీయ(Politics in Israel) ఊగిసలాట కొనసాగుతుంది. తాజా జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ దక్కకపోవడంతో యషార్ పార్టీ అధినేత(Leader of the Yashar Party) గాడి ఐజెన్‌కోట్, లికుడ్ పార్టీకి చెందిన తాత్కాలిక ప్రధాని నెతన్యాహుతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. నెతన్యాహును చర్చల కోసం ఐజెన్‌కోట్ ఆహ్వానించారు. అరబ్ పార్టీలతో కలిసి అధికారం పొందాలని చూస్తే వైదొలగుతామని పలువురు ప్రజాప్రతినిధులు ఐజెన్‌కోట్‌ను హెచ్చరించారు.

దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ఐజెన్‌కోట్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో నెతన్యాహుతో చర్చలు జరిపినా ఇరువురు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదురకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేకపోయారు. మరోమారు ఆదివారం (భారత కాలమాన ప్రకారం సోమవారం) ఇరువురు భేటీకానున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నూతన ప్రధాని ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది.

అక్టోబర్ 27న ఇజ్రాయెల్ పార్లమెంట్ 120 స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో ఐజెన్‌కోట్ (యషార్ పార్టీ) కూటమికి 48 స్థానాలు దక్కగా, నెతన్యాహు (లికుడ్ పార్టీ)కు 53 సీట్లు దక్కాయి. గెలుపోటములు నిర్ధారించేందుకు 61 స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. అరబ్ పార్టీలు 19 స్థానాలను గెలుచుకొని యషార్ (ఐజెన్‌కోట్)కు మద్దతు ప్రకటించాయి. యషార్, లికుడ్ రెండు పార్టీల్లో ఏదో ఒకటి అధికారం చేపట్టాలంటే అరబ్ పార్టీలు కీ రోల్ పోషించేస్థాయిలో ఉన్నాయి.

అయితే 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల నేపథ్యంలో ఈ పార్టీల మద్దతు తీసుకుంటే ఇరుపార్టీల కూటమి నేతలు రాజీనామాలు తప్పవని హెచ్చరిస్తుండడంతో యషార్ (ఐజెన్‌కోట్), లికుడ్ (నెతన్యాహు) ఎవరో ఒకరు అధికారం చేపట్టే దిశగా చర్చలు చేపట్టనున్నారు. ఇరుపార్టీలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు డిసెంబర్ 6 వరకు సమయం ఉంది.

అవసరమైతే మరో 14 రోజులు పొడిగించుకునే అవకాశం ఉంది. ఐజెన్‌కోట్ ఒక అడుగు ముందుకు వేసి అరబ్ పార్టీల మద్దతుతో తన కనుసన్నల్లో నడిచే నేతగా ముద్రపడ్డ మతాన్ కహానాను పార్లమెంట్ (క్నేసెట్) స్పీకర్‌గా నియమించారు. స్పీకర్ ఎన్నికల్లో ఐజెన్‌కోట్‌కు 66 ఓట్లు లభించగా, నెతన్యాహుకు 52 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. సమయం దగ్గరపడుతున్న మరోమారు ఎన్నికలు తప్పవా? అనే అనుమానాలు కూడా మరింత బలపడుతున్నాయి.

మరిన్ని వార్తలు