సామాజిక చైతన్య జ్యోతి
స్వాతంత్య్రానికి పూర్వం నిరక్షరా స్యత వల్ల అజ్ఞానంలో కొట్టు మిట్టాడుతున్న సమాజంలో అణగారిన వర్గాల జీవితాలకు ఆశా జ్యోతిలా వెలుగులు నింపాడు. అంటరానితనం, అస్పృ శ్యత, కుల వివక్షలను, మూఢ విశ్యాసాలను తరిమికొట్టి సమాజానికి మహాత్ము డిగా చెరగని ముద్ర వేసుకున్నారు. అక్షరాలతోనే అజ్ఞానపు చీకట్లు తొలగించవచ్చని సమాజాన్ని మేల్కొల్పిన ఆ నవయుగ వైతాళికుడే ‘మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule)’. ఒకపక్క బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ, మరోపక్క వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ మహిళోద్ధారణకు శ్రీకారం చుట్టిన ఆయన మహోన్నత ఆశయాలు ఎప్పటికీ ఆదర్శనీయమే.
1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించిన ఆయన.. పాఠశాల విద్య స్థాయిలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉపాధ్యాయుల మన్ననలు పొందారు. కొందరు మహనీయుల జీవిత చరిత్రలు, రచనల స్ఫూర్తితో సమాజ శ్రేయస్సుపై దృష్టి పెట్టారు. అప్పటికే సమాజంలో నెలకొన్న దురాచారాలను పారదోలేందుకు కంకణం కట్టుకుని, గొప్ప సంఘ సంస్కర్తగా, నవయుగ వైతాళికులిగా నిలిచిపోయారు. ఎన్నో సంఘ సంస్కరణలకు శ్రీకారం చు ట్టిన ఆయన.. ఆశయాలు, మార్గనిర్దేశకాలు నేటికీ సజీవంగా సమాజ స్మరణలో చెరగని ముద్ర వేసుకునే ఉన్నాయి.
సమాజానికి వెలుగుదివ్వెలా..
సమాజంలో నిరక్షరాస్యత, అంటరానితనం, అస్పృశ్యత, కుల మౌఢ్యం, కుటుం బ వ్యవస్థలోని వివక్షలను పూలే ప్రశ్నించాడు. మూఢ విశ్వాసాలు, బ్రాహ్మణ ఆధి పత్య ధోరణిని నిలదీశాడు. మనుషులంతా ఒక్కటేనని గళమెత్తాడు. దేవుడూ ఒక్కడేనని, భగవంతుడి ముందు అందరూ స మానమేనని చాటాడు. దేవుడిని కొలవడానికి మధ్యవర్తిగా పూజారులు, బ్రాహ్మ ణులు ఎందుకని ఆక్షేపించారు. మానవుడే మాధవుడని, మనిషి సాటి మనిషి గౌరవించుకోవాలని పూలే ప్రబోధించాడు. సా మాజిక దురాచారాలు, బాల్య వివాహాలపై వ్యతిరేక గళం వినిపించారు. ఈస్ట్ ఇండి యా కంపెనీ పాలనను సైతం వ్యతిరేకించారు. ఆర్థిక సామాజిక సమానత్వం కో సం, వెనుకబడిన బహుజన ప్రజల హక్కు ల రక్షణ, సంస్కృతి సంరక్షణ కోసం ఉద్యమాలు నడిపాడు. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిలా, వెలుగు దివ్వెలా నిలిచాడు.
మహనీయుల చరిత స్ఫూర్తితో..
జ్యోతిరావు పూలే మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యుడు. రెండు భాషల్లో సమాజాన్ని ప్రభావితం చేసేలా పలు రచనలు చేశాడు. తన రచనలు మొత్తం సామాజిక వివక్షను ప్రశ్నించేవిలా ఉండేవి. కుల రహిత సమాజం నిర్మాణం కోసం అక్షర పోరాటం సాగించాడు. పాశ్చాత్య దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థల విలువలు, సంస్కృతి, జీవన విధానంపై పూర్తిగా అధ్యయనం చేశాడు. శివాజీ జీవిత చరిత్ర, 1791లో థామస్ పేయిన్ రాసిన మానవ హక్కుల పుస్తకం, అమెరికా అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్ర, ఫ్రెంచ్, అమెరికా విప్లవ చరిత్రలను చదివిన ప్రభావంతో దేశభక్తిని కూడా చాటాడు. భారత దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన, సాంఘిక దురాచారాల విముక్తికి అక్షరాస్యత ఒక్కటే మార్గమని ముమ్మర ప్రచారం చేశాడు. సమాజ శ్రేయస్సుకు చదువే ఆయుధమని పిలుపునిచ్చాడు.
మహిళాభ్యుదయమే ధ్యేయంగా..
సమాజంలో సగభాగం వున్న స్త్రీలు అభివృద్ధి చెందక పోతే సమాజాభివృధి సాధ్యం కాదని పూలే భావించాడు. అం దుకు వారిలో అక్షర జ్యోతులు వెలగాలని నిర్ణయించాడు. పుణేలో 1848 ఆగస్టులో బాలికల పాఠశాల స్థాపించాడు. కులాలకు అతీతంగా చదువుకోవాలనే కోరిక గల బాలికలందరికీ ప్రవేశం కల్పించాడు. నిమ్న కులాల పిల్లలకు బోధించడానికి ఎవరూ ముందుకు రాకపోతే, అదే సంవత్సరం పుణెలోనే దళిత పాఠశాలను నెలకొల్పాడు. తన సతీమణి సావిత్రీబాయితో కలిసి ఇద్దరు ఉపాధ్యాయులుగా మారారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీబాయి పూలే నిలిచారు. 1851 లో మరో 2 పాఠశాలలు, 1855లో రాత్రి బడి కూడా స్థాపించి కార్మికుల్లో సైతం అక్షర జ్యోతులు వెలిగించాడు.
వితంతువులకు అండగా..
బాల్య వివాహాల వల్ల 15 లోపే వితంతువులై వారిని జ్యోతిరావ్ పూలే చేరదీశాడు. వారికి పునర్వివాహాలు చేసి వారి జీవితాలకు వెలుగులు ప్రసాదించాడు. వారి పిల్లల కోసం స్కూళ్లు, హాస్టళ్ల్లు ప్రారంభించాడు. 1873 కాలంలో పురోహితులు లేకుండానే ‘జున్నార్‘ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్లిళ్లు నిర్వహించి ప్రత్యామ్నాయ వివాహ వ్యవస్థకు బీజం వేశాడు. వితంతు పునర్వివాహం గురించి ప్రజల్లో చైతన్యం రగిలిం చాడు. 1864లో ‘బాల హత్య ప్రతిబంధక్ గృహ’ స్థాపించి వితంతువులైన గర్భిణులకు అండగా నిలిచాడు.
మొదటి సంస్కరణోద్యమం..
శూద్రులను బ్రాహ్మణుల చెర నుండి కాపాడటానికి 1873లో పూలే ‘సత్య శోధక్’ సమాజాన్ని నెలకొల్పి దేశంలో మొట్టమొదటి సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ’దేశబంధు’ వార పత్రిక ద్వారా తన ఆలోచనలు ప్రజలకు చేరవేశాడు. కార్మికుల హక్కుల కోసం పోరా డాడు. 16 గంటల నుంచి 12 గంటలను సాధించాడు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారుల మీద వడ్డీ వ్యాపారుల పెత్తం దార్ల దౌర్జన్యాలను నిలదీశాడు పూలే. శ్రమ దోపిడీని వ్యతిరేకించాడు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
విగ్రహారాధనను ఖండించాడు. స్త్రీ, పురుషుల మధ్య లింగ వివక్షను నిరసించాడు . సమానత్వం’ స్వేచ్ఛ ఐక్యమైత్యంతో కూడిన నవ సమాజాన్ని కాంక్షించాడు. నిమ్నవర్గాల అభ్యుదయానికి విద్య ఒక్కటే మార్గమని ప్రభోదించాడు. పూలే కృషిని చూసిన డాక్టర్ అంబేద్కర్ తండ్రి రాంజీ ఎంతగానో ప్రభావితమయ్యాడు. తన పిల్లలను బాగా చదివించాలని భావించాడు. పూలే సతీమణి సావిత్రిబాయి సైతం ఆయన అడుగుజాడల్లోనే నడిచారు. ప్లేగు వ్యాధి బాధితులకు సేవలందించారు.
సమాజం శ్రేయస్సు కోసం విశేష కృషి చేసిన జ్యోతిరావు పూలే దేశంలో అనేక మంది సంఘ సంస్కర్తలను ఆకర్షించాడు. మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో అనేక పాఠశాలలను స్థాపించి విద్య ప్రాముఖ్యతను సమాజానికి చాటారు. సమాన హక్కులతో కూడిన ఆధునిక విద్య ఆధునిక సైస్ అభివృద్ధి పూలే చూపిన మార్గం గొప్పదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొనడం గమనార్హం.
అజాత శత్రువు..
పూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు గిట్టని అగ్రవర్ణాల వారు ఆయన్ను హత్య చేయడానికీ వెనుకాడలేదు. అలా వచ్చిన వారిని తన సంస్కరణల ఉద్యమంలో భాగస్వాములను చేసి తమ అనుచరులుగా మార్చుకుని అజాత శత్రువుగా గుర్తింపుపొందాడు. బ్రాహ్మనేతరులను టీచర్లుగా నియమించాలని హంటర్ కమిషన్‌కు పూలే చేసిన విజ్ఞప్తిని నాటి బ్రిటిష్ పాలకులు అమలుచేశారు.
లింగ, కుల వివక్షపై పోరాటం..
సమాజంలో స్త్రీ,పురుషులు ఇద్దరూ సమానమేనని చాటాడు పూలే. పురుషులతో పాటు మహిళలకు సమాన విద్య, వేతనాలు, ఉపాధి అవకాశాలు దక్కాలని పోరాడాడు. లింగ వివక్షను ప్రశ్నించాడు. కుటుంబ వ్యవస్థకు స్త్రీ, పురుషులిద్దరు రథచక్రాల లాంటి వారని సూచించాడు. తన రచనలు, ఉపన్యాసాల ద్వారా స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటాడు. కుల వివక్షపై కూడా పూలే పోరాటం సాగించాడు. ‘గులాంగిరీ’ ‘సేద్యం కాని చర్నా కోల’ గ్రంథాలు రచించి దుర్మార్గమైన కుల వ్యవ స్థ పట్ల నిరసన వెళ్లగక్కాడు. దేశమనే దేహానికి శూద్రులు రక్తనాళాల లాంటి వారని పూలే అభిప్రాయపడ్డాడు.
ఆధునిక యుగ పురుషుడు..
నవ సమాజ పునర్నిర్మాణం కోసం మొట్టమొదట దారులు వేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే, ఆధునిక యుగ పురుషుడుగా చరిత్రలో చిరస్మరణీయుడు. సాంఘిక దురాచారాల నిర్మూలనకు న డుం బిగించిన విప్లవ కెరటం, సమాజానికి దిశా నిర్దేశం చేస్తూ జాతిని జాగృతం చేసి తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల్లో అగ్రగణ్యుడు పూలే. సామాజిక ప్రజాస్వామ్య భారత దేశానికి సామాజిక, న్యాయ కల్పనకు మహత్తర సందేశం అం దించిన జ్యోతిరావు పూలే తన గురువని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రకటించడం గమనార్హం.
మహాత్మ.. బిరుదాంకింతుడు
దక్షిణాఫ్రికా జాతియోద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో పూలే రచించిన గులాంగిరి గ్రంథాన్ని కానుకగా సమర్పించాడు. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికి పూలే చేసిన కృషిని గుర్తించి ‘మహాత్మా’ బిరుదు ఇచ్చారు. మహరాష్ట్రలోని పుణే పట్టణంలో గోవిందరావు చీమన్బాయి దం పతులకు,1827 ఏప్రిల్ 11ను పూలే జన్మించాడు. పాఠశాల స్థాయిలో బహుముఖ ప్రజతో ఉపాధ్యాయుల మన్ననలు పొం దిన పూలే.. మహనీయుల చరిత్రల స్ఫూర్తి తో సమాజ సంస్కరణలకు బీజం వేశాడు.
వెనకబడిన వర్గాల విముక్తి కోసం శ్రమిం చి సమాజ సేవలో తరించిన పూలే దీర్ఘకాలిక జబ్బుతో1890 నవంబర్28న పరమ పదించారు. పూలే ఆశించిన సమాజం కోసం వారు చేసిన ఉద్యమాలను స్ఫూర్తి గా తీసుకొని వెనుకబడిన బహుజనుల సమాజ సమగ్ర వికాసానికి ‘ సామాజిక న్యాయం‘ కోసం ప్రభుత్వాలు పౌర సమాజం, సామాజిక సమానత్వ సాధనకు నడుంబిగించాలి. ఆయన వెలిగించిన అక్షర జ్యోతి కాంతుల్లో సామాజిక సమరసత, సౌహార్ధ్రత, వివక్ష, కుల, మత, రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం. అదే ఆయనకు మనమిచ్చే నివాళి.
తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు
9440245771
నేదునూరి కనకయ్య