జర్నలిజం విద్యకు చికిత్స ఎప్పుడు?

25-11-2026 | 05:10am

మల్లాది వేంకట గోపాలకృష్ణ :

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా చెప్పుకునే మీడియా రంగం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా నిలిచే జర్నలిజం కాలానికి అనుగుణంగా కొత్తపుంతలు తొక్కుతున్నది. కానీ.. జర్నలిజం విద్యకు, క్షేత్రస్థాయి పని విధానాలకు పొంతన లేకుండా పోతున్నదనే అభిప్రాయాలున్నాయి. చదివిన చదువుకు, చేసే విధుల మధ్య వైరుధ్యం.. జర్నలిజం డిగ్రీలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ప్రతి ఏటా దేశంలోని వందలాది విశ్వవిద్యాలయాలు, కళాశాలల(Universities and colleges) నుంచి వేలాది మంది జర్నలిజం(Journalism), మాస్ కమ్యూనికేషన్ పట్టభద్రులు(Mass Communication Graduates) బయటకొస్తున్నారు. చేతిలో డిగ్రీ, కళ్లలో కలలు.. న్యూస్ రూమ్(Newsroom) తలుపు తట్టగానే వారికి ఎదురయ్యే మొదటి మాట ‘చదివిందంతా మర్చిపో, మళ్లీ మొదటి నుంచి నేర్చుకో’! రెండుమూడేళ్ల చదువు ఉద్యోగంలో మొదటి వారానికే పనికిరాకుండా పోతే లోపం ఎవరిది? విద్యార్థిదా, పరిశ్రమదా, లేక విశ్వవిద్యాలయాలదా? నిజాయితీగా చెప్పాలంటే విశ్వవిద్యాలయాలు, న్యూస్‌రూమ్‌లు రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతున్నాయి. ఒకటి పరీక్షలు, మార్కులు, పట్టాల ప్రపంచం.

మరొకటి డెడ్‌లైన్లు, బ్రేకింగ్ న్యూస్‌లు, వాస్తవాల ప్రపంచం. ఈ రెండిం టి మధ్య వంతెన లేకపోవడమే అసలు సమస్య. ఈ దూరాన్ని పూడ్చాలంటే చిన్నచిన్న మరమ్మతులు, పైపై మెరుగులు సరిపోవు. బోధన నుంచి శిక్షణ దాకా, సిలబస్ నుంచి సంస్కృతి దాకా జర్నలిజం విద్యకు సమగ్ర శస్త్రచికిత్స అవసరం.

ఇప్పుడే ఎందుకు?

ఈ చికిత్స ఇప్పుడే ఎందుకంటే, మన దేశంలో జర్నలిస్టులు తయారయ్యే దారి మారిపోయింది. 2023 75 దేశాల్లో జరిగిన అంతర్జాతీయ వరల్డ్స్ ఆఫ్ జర్నలిజం స్టడీ సర్వేలో పాల్గొన్న భారతీయ జర్నలిస్టుల్లో 96.7 శాతం మందికి విశ్వవిద్యాలయ డిగ్రీ ఉంది; 85 శాతం మందికి జర్నలిజం డిగ్రీయే ఉంది. ఒకప్పుడు పత్రికా కార్యాలయమే జర్నలిస్టును తయారుచేసేది; నేడు ఆ బాధ్యత దాదాపు పూర్తిగా విశ్వవిద్యాలయాల భుజాలపైకి వచ్చింది. అంటే తరగతి గది నాణ్యతే రేపటి పత్రికారంగ నాణ్యత. తరగతి గది బలహీనమైతే ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభానికి చెద పట్టినట్టే.

లోపాన్ని కనిపెట్టడం..

విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం విభాగాల్లో లోపాలు, అవకతవకలు, అవలక్షణాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. పాఠ్యప్రణాళికలు సిద్ధాంతాలతో నిండిపోయి ఆచరణకు చోటులేకుండా పోయింది. పుస్తకాల్లో ఎక్కువ భాగం అమెరికా, యూరప్ అనుభవాల మీద ఆధారపడినవే; మన ప్రాంతీయ పత్రికల బలం, బహుభాషా మీడియా వాస్తవాలు, కుల-మత సమీకరణాలు, గ్రామీణ జీవనం ఆ పుస్తకాల్లో కనిపించవు.

చాలా విభాగాల్లో ల్యాబ్‌లు పాతబడ్డాయి, కెమెరాలు మూలన పడ్డాయి, విద్యార్థులు నడిపే పత్రికలు మూతపడ్డాయి. బోధించే అధ్యాపకుల్లో చాలామందికి న్యూస్‌రూమ్ అనుభవం లేదు. పరీక్షలు జ్ఞాపకశక్తిని కొలుస్తున్నాయి, రిపోర్టింగ్ సామర్థ్యాన్ని కాదు. పుస్తకంలోని నిర్వచనాలను అప్పజెప్పగలిగిన విద్యార్థికి ఫస్ట్ క్లాస్ వస్తుంది; ఒక వార్డు సభకు వెళ్లి పది వాక్యాల వార్త రాయగలిగిన విద్యార్థికి మాత్రం మార్కులు రావు.

భాషపై పట్టులేక!

భాష విషయంలో పరిస్థితి మరీ విచిత్రం. ఉద్యోగాలు ఎక్కువగా తెలుగు మీడియాలో ఉంటే, చదువు మాత్రం ఎక్కువగా ఇంగ్లీషులో సాగుతోంది. మరోవైపు తెలుగు మాత్రమే తెలిసిన విద్యార్థులు ఇంగ్లిష్ జర్నలిజాన్ని ఒంట పట్టించుకోలేకపోతున్నారు. ఇక జాతీయ స్థాయిలో విస్తృతంగా వాడే హిందీ సంగతి సరేసరి. పట్టుమని పది హిందీ ముక్కలు రానివాళ్లు జాతీయ నాయకుల ప్రసంగాలు, వార్తా సంస్థల కథనాలు అనువదించలేక ఫీల్డులో అనేక ఇబ్బందులు పడుతుంటారు. నిజానికి తెలుగు, ఇంగ్లిష్, హిందీ మూడు భాషల్లో ప్రావీణ్యం ప్రతి ఒక్క జర్నలిస్టుకూ ప్రాథమిక అర్హత కావాలి. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు.

వీధికొక్క మాస్ కోర్సు సెంటర్లు!

మరో వైపు వీధికొక కళాశాలలో మాస్ కమ్యూనికేషన్ కోర్సులు వెలుస్తున్నాయి. కెమెరా లేదు, స్టూడియో లేదు, ప్రైవేటు అధ్యాపకుడికి న్యూస్‌రూమ్ ముఖమే తెలియదు. అయినా పట్టాలు మాత్రం యధేచ్ఛగా వస్తున్నాయి. వైద్య విద్యకు, న్యాయ విద్యకు, సాంకేతిక విద్యకు ఉన్నట్టు జర్నలిజం విద్యకు కనీస ప్రమాణాలను నిర్దేశించే వృత్తిపరమైన మండలి లేదు. ఇవన్నీ కలిసి జర్నలిజం విద్యావ్యవస్థలోనూ, మీడియా పరిశ్రమలోనూ ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టించాయి. డిగ్రీలు పెరుగుతున్నాయి, కానీ నిజమైన, నిఖార్సయిన , జర్నలిస్టులు తయారు కావడం లేదు.

మొదటి చికిత్స: బోధకులను మార్చాలి

ఈత నేర్పేవాడు నీళ్లలో దిగిన వాడై ఉండాలి. విశ్వవిద్యాలయ నియామకాల్లో పీహెచ్‌డీ, నెట్ వంటి విద్యార్హతలకే ప్రాధాన్యం ఉండటంతో దశాబ్దాలు న్యూస్‌రూమ్‌లో గడిపిన ఎడిటర్లు తరగతి గదికి దూరమయ్యారు. ఈ అడ్డుగోడను తొలగించడానికే యూజీసీ 2022లో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. వాటి ప్రకారం తమ రంగంలో కనీసం పదిహేను సంవత్సరాల విశేష అనుభవం ఉన్న నిపుణులను, మీడియా వృత్తి నిపుణులతో సహా, సంప్రదాయ విద్యార్హతలు, పరిశోధనా పత్రాల నిబంధనలు లేకుండానే అధ్యాపకులుగా నియమించుకోవచ్చు.

ఒక సంస్థలో మంజూరైన పో స్టుల్లో పది శాతం వరకు ఇలాంటి వారిని తీసుకోవచ్చు; వీరి నియామకం రెగ్యులర్ పోస్టులకు అదనం, వాటికి గండి కాదు. ఇక అప్పటికే బోధనా రంగంలో పాతుకుపోయిన వాళ్ల అభద్రతలు, భయాల వల్ల మీడియా పరిశ్రమలో విశేషమైన అనుభవం ఉన్నవారికి విశ్వవిద్యాలయ స్థాయి బోధనలో సరైన అవకాశాలు దక్కడం లేదు. దక్కినా వారిని అతిథి అధ్యాపకుల హోదాకే పరిమితం చేసి, పాఠ్యాంశాల రూపకల్పనలోనూ, మూల్యాంకనంలోనూ పాత్ర లేకుండా చేస్తున్నారు.

ప్రతిభకు తగిన విధంగా రాణించేందుకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా నష్టపోతున్నది విద్యార్థులే. ప్రతి జర్నలిజం విభాగంలో కనీసం ఒకరిద్దరు అనుభవజ్ఞులైన జర్నలిస్టులు పూర్తి బాధ్యతతో, పూర్తి గౌరవంతో బోధించే వ్యవస్థ ఉండాలి. అంతేకాదు, ప్రస్తుత అధ్యాపకులు కూడా కొన్నేళ్లకోసారి కొన్ని నెలలపాటు న్యూస్‌రూముల్లో పనిచేసే రివర్స్ ఇంటర్న్‌షిప్ విధానం తేవాలి. పదోన్నతుల సమయంలో ఈ అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మారుతున్న పరిశ్రమను దగ్గరగా చూడని అధ్యాపకుడు విద్యార్థిని భవిష్యత్తుకు సిద్ధం చేయలేడు.

రెండో చికిత్స: సిలబస్‌కు ఊపిర్లు! 

మీడియా రంగం ప్రతి రెండు మూడేళ్లకు రూపం మార్చుకుంటోంది. అచ్చు నుంచి టీవీకి, టీవీ నుంచి వెబ్‌సైట్లకు, అక్కడి నుంచి యూట్యూబ్, సోషల్ మీడియాకు, ఇప్పుడు కృత్రిమ మేధ రాసే వార్తల దాకా ప్రయాణం వేగంగా సాగిపోయింది. పదేళ్ల కిందటి సిలబస్‌తో నేటి విద్యార్థిని తయారు చేయడం అసాధ్యం. ప్రతి జర్నలిజం విభాగానికి ఎడిటర్లు, డిజిటల్ మీడియా నిపుణులు, పూర్వ విద్యార్థులతో కూడిన పరిశ్రమ సలహా మండలి ఉండాలి. ఆ మండలి ప్రతి రెండేళ్లకోసారి సిలబస్‌ను సమీక్షించాలి.

ఇందుకు చక్రాన్ని మళ్లీ కనిపెట్టాల్సిన అవసరం లేదు. యునెస్కో 2007లోనే అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం జర్నలిజం విద్యకు నమూనా పాఠ్యప్రణాళికలు రూపొందించింది. అరవైకి పైగా దేశాల్లో దాదాపు డ్బ్బు జర్నలిజం శిక్షణ సంస్థలు వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. 2013లో కొత్త సవాళ్లకు అనుగుణంగా ప్రత్యేక సిలబస్‌ల సంకలనాన్ని కూడా విడుదల చేసింది. వాటిని మన సామాజిక, భాషా వాస్తవాలకు అనుగుణంగా మలచుకుంటే చాలు.

వార్తల ధ్రువీకరణ, ఫ్యాక్ట్ చెకింగ్, డేటా జర్నలిజం, మొబైల్ జర్నలిజం, సామాజిక మాధ్యమాల విశ్లేషణ, సైబర్ చట్టాలు మొదలైనవన్నీ ఇప్పుడు ఐచ్ఛిక అంశాలు కావు, తప్పనిసరి పాఠాలు. మరీ ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) జర్నలిజాన్ని మూలాల్లోనే మారుస్తోంది. చిన్న వార్తలు రాయడం, అనువాదం, శీర్షికలు సూచించడం యంత్రాలే చేసేస్తున్నాయి. అదే సమయంలో డీప్‌ఫేక్‌లు, కల్పిత కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యంత్రం చేయలేనిదేమిటో అదే కీలకం.

క్షేత్రస్థాయి పరిశీలన, మనుషులతో మాట్లాడి నిజాన్ని వెలికితీయడం, సందర్భాన్ని అర్థం చేసుకుని విశ్లేషించడం, నైతిక విచక్షణ అనేవే రేపటి జర్నలిస్టు విలువ. ఏఐని ఎలా వాడాలో, ఎక్కడ ఆగాలో, దాని తప్పులను ఎలా పట్టుకోవాలో నేర్పని సిలబస్ నేటి విద్యార్థికి అన్యాయం చేసినట్టే. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ 2026 జనవరిలో 51 దేశాల్లోని 280 మంది మీడియా నాయకులను సర్వే చేసింది.

తమ సంస్థల్లో ఏఐ ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నాయని 44 శాతం మంది చెబితే, ఫలితాలు పరిమితమేనని 42 శాతం మంది అంగీకరించారు. యంత్రాలు సృష్టించే నాసిరకం సమాచార వెల్లువలో నిలబడాలంటే అసలైన, క్షేత్రస్థాయి జర్నలిజమే మార్గమని ప్రపంచ మీడియా సంస్థలు గుర్తిస్తున్నాయి. మన సిలబస్ కూడా అదే దిశగా మారాలి.

మరో కొత్త అవసరం జర్నలిస్టుల భద్రత. పైన పేర్కొన్న అంతర్జాతీయ సర్వే ప్రకారం గత ఐదేళ్లలో 66.9 శాతం భారతీయ జర్నలిస్టులు అవమానకరమైన, ద్వేషపూరిత దూషణలను ఎదుర్కొన్నారు; 55.2 శాతం మంది నిఘాకు గురయ్యామని, 40.3 శాతం మంది తమ సామాజిక మాధ్యమ ఖాతాలు హ్యాక్ లేదా బ్లాక్ అయ్యాయని చెప్పారు. కానీ భద్రత శిక్షణ పొందినవారు 33.5 శాతమే. డిజిటల్ భద్రత, న్యాయపరమైన రక్షణలు, ప్రమాదకర ప్రాంతాల్లో రిపోర్టింగ్ జాగ్రత్తలు కూడా ఇప్పుడు జర్నలిజం సిలబస్లో భాగం కావాలి.

అదే సమయంలో పాఠ్యాంశాలు మన సమాజాన్ని ప్రతిబింబించాలి. గ్రామీణ రిపోర్టింగ్, వ్యవసాయం, కోర్టులు, స్థానిక సంస్థలు, ఎన్నికలు, బడ్జెట్, ఆరోగ్యం, విద్య, సామాజిక న్యాయం వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రమైన అవగాహన కల్పించగలిగేవాళ్లే బోధకులుగా ఉండాలి. ఎందుకంటే చదువు పూర్తి చేసుకుని ఫీల్డ్లో అడుగుపెట్టిన విద్యార్థులు రేపటి రోజున ఎదుర్కొనే వాస్తవాలు ఇవే.

 వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు, మీడియా పరిశోధకులు

(మిగతా భాగం రేపటి సంచికలో..)

మరిన్ని వార్తలు