క్యూర్, ప్యూర్‌లో వేగంగా అభివృద్ధి

25-11-2026 | 05:45am
  1. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలి
  2. నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్‌టీఎస్ డిపోలు 
  3. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  4. జనవరిలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్-1 పనులు
  5. ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు

హైదరాబాద్, నవంబర్ 24 (విజయ క్రాంతి): క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లో(Cure, Pure region) మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల(Municipal and Urban Development Department) పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై  మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ సెంటర్‌లోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 

మూసీ పునరుజ్జీవం ప్రాజక్టు(Musi Rejuvenation Project) ఫేజ్-1లో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కి.మీ. ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ. ప్రాంతాన్ని జోన్-1 బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2027 లో ఫేజ్- 1 పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వారు వివరించారు. ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు.

2028 జనవరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. మిరాలం చెరువు అభివృద్ధిని చేపట్టడంతోపాటు చెరువులో ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని  అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని అధికారులు వివరించగా.. రేడియల్ రోడ్ల నిర్మాణంలో పనులను మరింత వేగం పెంచాలని సీఎం సూచించారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనుల పురోగతిని ఆరా తీసిన సీఎం.. 2027 మార్చి నాటికి పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలన్నారు. 

పీఆర్‌టీఎస్ అలైన్‌మెంట్‌పై..

హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) ఫేజ్-1 కు సంబంధించి టెక్నో ఎకానమీ ఫీజిబిలిటీని అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయో డైవర్సిటీ వరకు అలైన్‌మెంట్ సాధ్యాసాధ్యాలను వివరించారు.  బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు అలైన్‌మెంట్ ప్రతిపాదనల గురించి అధికారులు తెలిపారు.

దీంతో పాటు నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్‌టీఎస్ డిపోలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. డిపో పరిసరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఉండేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రూట్స్, డిపోల నిర్మాణం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో ఐఐఐటీ జంక్షన్ వద్ద ఫుట్ బ్రిడ్జికి సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఫుట్ బ్రిడ్జి సమీపంలో ప్రధానంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. 

ఫ్రూట్ మార్కెట్ పనులు స్పీడప్..

కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధి పనులతో మెరుగైన రవాణా సౌకర్యం కోసం సమాంతరంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. క్యూర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పనుల వివరాలను సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు.

చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటు ప్రతిపాదనలను హైడ్రా కమిషనర్ వివరించారు. ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. నగరంలో మెట్ల బావుల పునరుద్ధరణ విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు