కలం వీరుడు.. షోయబుల్లా ఖాన్
హైదరాబాద్ సంస్థాన చరిత్రలో 1948 నాటి కాలఘట్టం ఒక రక్తసిక్తమైన, సంక్షుభిత అధ్యాయం. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్(Mir Osman Ali Khan) నిరంకుశ ఆధిపత్యం, స్వతంత్ర హైదరాబాద్గా నిలబెట్టాలన్న దురాశ, దాని నీడన పడగవిప్పిన మజ్లిస్- ముస్లిమీన్ సైనిక విభాగం రజాకార్ల అకృత్యాలు దక్కన్ పీఠభూమిని కల్లోల సముద్రంగా మార్చాయి. ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్ల దమనకాండ, హింస, దోపిడీలు ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
అటువంటి కారుచీకటి వేళ, ఆధిపత్యశక్తుల గొంతుకల నడుమ ఒక స్వచ్ఛమైన, ధిక్కారస్వరం కలమెత్తి గర్జించింది. ఆ స్వరమే షోయబుల్లా ఖాన్(Shoaibullah Khan). పాణభయం వెంటాడుతున్నా, పాలకుల బెదిరింపులు ఎదురవుతున్నా ప్రజల స్వేచ్ఛ కోసం, భారత సమాఖ్యలో విలీనం కోసం పోరాడిన నిఖార్సయిన కలం యోధుడు ఆయన. హైదరాబాద్ సంస్థానంలో నాటి పోరాటం మతాల మధ్య సాగినది కాదు.. నిరంకుశత్వానికి, ప్రజా స్వామిక ఆకాంక్షలకు మ ధ్య జరిగిన భావజాల మహాసంగ్రామం.
ఆ కాలంలో నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడిన ముస్లింలను దేశద్రోహులుగా ముద్రవేసి రజాకార్లు చిత్రహింసలకు గురిచేసేవారు. అయినప్ప టికీ హైదరాబాద్ విలీనాన్ని సమర్థించిన ముస్లిం మేధావులకు కొదువలేదు. 1948 ఆగస్టు 13న ఖాజీ అబ్దుల్ గఫార్ సంపాదకత్వంలో వెలువడే ప్రఖ్యాత ఉర్దూ దినపత్రిక ‘పయామ్’లో ఏడుగురు ప్రముఖ ముస్లిం మేధావులు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
ఆ ప్రకటన హైదరాబాద్ రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఆ మేధావుల స్వరం వెనుక నిలబడిన యువ పాత్రికేయ కెరటం షోయబుల్లా ఖాన్. మొదట ‘రయ్యత్’ పత్రికలో బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు వంటి నేతలతో కలిసి పనిచేసిన షోయబుల్లా, ఆ పత్రికపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించినా వెనుకంజ వేయలేదు. తన మేనమామ, సీనియర్ జర్నలిస్టు ఇస్మాయిల్ ఖాన్ సహకారంతో ‘ఇమ్రోజ్’ (నేడు) అనే ఉర్దూ దినపత్రికను స్థాపించి సంపాదకుడిగా నడిపించారు.
‘ఇమ్రోజ్’ కేవలం వార్తాపత్రిక కాదు, అది నిజాం దుర్మార్గాలను చీల్చిచెండాడే ప్రజాస్వామ్య వేదిక. నిజాం పోలీసుల పక్షపాత వైఖరిని, గ్రామా లలో రజాకార్లు సాగిస్తున్న అత్యాచారాలను, సజీవ దహనాలను, సంపదల దోపిడీని షోయబుల్లా తన నిప్పులు చెరిగే సంపాదకీయాల్లో ఏకిపా రేశారు. ఈ రచనలు ఖాసిం రజ్వీకి, నిజాం సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. నిజాంను లేదా రజాకార్ల వ్యవస్థను ప్రశ్నించే విమర్శకుల చేతులు నరికేస్తామని, నాలుకలు కోసేస్తామని రజ్వీ బహిరంగ సభల్లో విషం చిమ్మాడు.
1948 ఆగస్టు 21 అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఆగస్టు 22 తెల్లవారుజామున, హైదరాబాద్లోని లింగంపల్లి - కాచిగూడ సమీపంలోని చప్పల్బజార్ ప్రాంతంలో అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసు కుంది. ‘ఇమ్రోజ్’ పత్రిక తాజా సంచిక ముద్రణను స్వయంగా పర్యవేక్షించి, తన బావ ఇస్మాయిల్ఖాన్తో కలిసి కాలినడకన ఇంటికి తిరిగెళ్త్తుండగా రజాకార్ మూకలు మెరుపుదాడి చేసి తుపాకులతో షోయబుల్లాపై గుళ్లవర్షం కురిపించాయి. నిజాంకు వ్యతి రేకంగా సంపాదకీయాలు రాసిన ఆ కలం కుడిచేతిని కత్తులతో క్రూరంగా నరికేశారు.
ఆయనను కాపాడబో యిన ఇస్మాయిల్ ఖాన్ కూడా తీవ్రంగా గాయపడి చేయిని కోల్పోయారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న షోయబుల్లాఖాన్ను స్థానికులు అతికష్టమ్మీద ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం, లోతైన గాయా ల కారణంగా వైద్యుల చికిత్స ఫలించక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆగస్టు 22న ఆ మహనీయుడు అమరుడయ్యా డు. ఈ ఘోర హత్యతో ‘ఇమ్రో జ్’ గొంతు మూగబోయింది.
వ్యాసకర: సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్ 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల