కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్
500 రోజుల్లో కేసీఆరే మళ్లీ సీఎం: కేటీఆర్
- బోగస్ మాటలు, ఉట్టి హామీలతో కాంగ్రెస్ మోసం
- ప్రతి మహిళకు రూ. 2,500 ఇస్తామన్న హామీ ఏమైంది?
- అన్ని స్కీమ్‌లతో కలిపి ప్రతి మహిళకు రూ.1.50 లక్షలు బాకీ
- ఆ మొత్తం చెల్లిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంట
- ఇది ప్రజాపాలన కాదు.. పర్సెంటేజీల పాలన
- నా గడ్డం రేవంత్కేం అడ్డం.. తిట్టడం తప్ప ఆయన చేసిందేమిటి?
- ఇంటర్ రద్దు నిర్ణయం ఎవరి ప్రయోజనాల కోసమని ఆగ్రహం
హనుమకొండ (మహబూబాబాద్), నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress government) కౌంట్‌డౌన్ మొదలైందని, 500 రోజుల్లో కేసీఆరే మళ్లీ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నా రు. బోగస్ మాటలు, ఉట్టి హామీలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టి మోసం చేసిందని మండిపడ్డారు. ‘ఈమధ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నా గడ్డం గురించి మాట్లాడుతున్నడు. నా గడ్డం ఆయనకేం అడ్డం?
పెన్షన్లు ఇవ్వడానికా, రైతు భరోసా ఇవ్వడానికా, ఎందుకు నా గడ్డం అడ్డం వచ్చిందో రేవంత్ చెప్పాలి’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆ మాటలు విన్న వారు బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని, రేవంత్రెడ్డికైతే బకెట్ నీళ్లు చాలని ఆయన వ్యాఖ్యానించారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనచైతన్య సభ జరిగింది. ఇందులో కేటీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలను ఆగం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వంలోని అవినీతి, 20 శాతం కమీషన్ల వ్యవహారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా పర్సంటేజీల పాలన సాగుతోందని.. ఇది దివాలాకోరు ప్రభుత్వమని ఆయన దుయ్యబట్టారు.
ప్రతి మహిళకు రూ.1.50 లక్షలు ఇవ్వాలి
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని.. రాబోయే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ అన్నారు. ‘పెన్షన్లు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు వాస్తవాలు మాట్లాడాలి. నాలుగు లక్షల 71 వేల పెన్షన్లు తొలగించి.. కొత్తగా నాలుగు లక్షల 63 వేల పెన్షన్లు మాత్రమే ఇచ్చినప్పుడు పెంచినట్లా.. తగ్గించినట్లా? ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 36 నెలలుగా ఆ హామీని అమలు చేయడం లేదు.
ఒక్కో మహిళకు రూ.85,500 బకాయి పడింది. ఇతర పెండింగ్ హామీలను కలిపితే చెల్లించాల్సిన మొత్తం రూ.1.50 లక్షలకు చేరుతుంది. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం లక్షాధికారులైనా చేయాలి’ అని ఆయన సవాల్ విసిరారు.
ప్రతి మహిళకు బాకీ పడ్డ రూ.1.50 లక్షల చొప్పున ఇచ్చి లక్షాధికారులను చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలిపెట్టి వెళ్తానని కేటీఆర్ ప్రకటించారు. కల్యాణలక్ష్మికింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు రూ.10 వేల నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సాయం వంటి హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.
ఇంటర్ రద్దు ఎవరికోసం?
ముఖ్యమంత్రి, మంత్రి కుటుంబాలకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేసి, పాఠశాల విద్యలో విలీనం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద 1,217 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించిన కళాక్షేత్రంలో కుడా కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఏమిటి? కవులు, కళాకారులు, రచయితల కోసం నిర్మించిన కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చాలనుకోవడం దారుణం. వరంగల్ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతోనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది’ అని పేర్కొన్నారు.
సాగునీటి నిర్వహణలోనూ ఫెయిల్
గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. దేవాదుల పంపులు, కన్నెపల్లి మోటార్లను సమర్థంగా నిర్వహించి నీటిని వినియోగించుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. చెరువులు, రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నడు.
ఈ మధ్య రేవంత్‌రెడ్డి నా గడ్డం గురించి మాట్లాడుతున్నడు. నా గడ్డం ఆయనకేం అడ్డం. గడ్డం మీద మాట్లాడటం, తిట్టడం తప్ప రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలో కరువు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై ఆయనకు పట్టింపు లేదు. బూతులు మాట్లాడటం తప్ప రాష్ట్రానికి రేవంత్ చేసిందేమీ లేదు. ఆయనది ఇజ్జత్ తక్కువ బతుకు’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.
ఢిల్లీ బానిసత్వానికి చరమగీతం
1,200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే అధిష్ఠానాల మెప్పే వారికి ముఖ్యమైందని దుయ్యబట్టారు. ‘కాకతీయుల పౌరుషానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకోవాలి.
వరంగల్ అభివృద్ధి, యువతకు ఉపాధి, ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలి’ అని ఆయన కోరారు. వరంగల్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే వరంగల్‌లో కాగడాల ప్రదర్శనలో కవాతు చేసిన రోజులు, 17 ఏండ్ల క్రితం నవంబర్ 29న అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీగా గడిపిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తున్నాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగిన ప్రతి కీలక సందర్భంలోనూ వరంగల్ అండగా నిలిచిందని తెలిపారు.
‘తెలంగాణ ఉద్యమంలో ప్రతి పరీక్షా సమయంలోనూ ఓరుగల్లు అండగా నిలిచింది. భవిష్యత్తులోనూ వరంగల్ ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటుంది. 2028లో కేసీఆర్ తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని బలంగా నమ్ముతున్నాను. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు ఉపాధి, వరంగల్ ప్రగతి, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలంటే కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలి. కేసీఆర్ తిరిగి అధికారంలోకి తెచ్చుకుంటేనే వరంగల్‌తోపాటు తెలంగాణ సురక్షితంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా, ఈ సభ వేదికగా ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి, పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సభలో నేతలు సిరికొండ మధుసూదనాచారి, బండ ప్రకాష్, వద్దిరాజు రవిచంద్ర, పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, డాక్టర్ రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, ఆరూరి రమేష్, బానోత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీలు కవిత, బోయిన్పల్లి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ అభివృద్ధిని అటకెక్కించారు
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక, విద్యా, వైద్య, ఐటీ కేంద్రంగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు పునాదులు వేశామని కేటీఆర్ తెలిపారు. ‘24 అంతస్తులు, 2,250 పడకలు, 35 వైద్య విభాగాలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను 90 శాతం పూర్తి చేశాం. జనగామ, మహబూబాబాద్ ఆసుపత్రుల పనులు కూడా దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వైద్య విద్యకు పెద్దపీట వేశాం.
మడికొండ ఐటీ పార్కులో ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ, సైయెంట్, టెక్ మహీంద్రా, క్వాడ్రంట్ వంటి కంపెనీలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాం. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కిటెక్స్, గణేశా ఎకోస్పియర్, యంగ్వన్ వంటి పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించాం. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించాం. రూ.150 కోట్లతో రెండు సమీకృత కలెక్టరేట్లు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం’ అని వివరించారు.
మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్‌కు ఒక్క కొత్త ఐటీ కంపెనీని, ఒక్క కొత్త పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని, అభివృద్ధిని అటకెక్కించారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మిగిలిన పనులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతున్నదని, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నదని దుయ్యబట్టారు. మెడికవర్ ఆసుపత్రితో ముఖ్యమంత్రి బినామీ సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు.
‘హైదరాబాద్ సమీపంలో నాడు కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దాని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని ప్రచారం చేసుకుంటున్నది’ అని కేటీఆర్ విమర్శించారు. నిజమైన భవిష్యత్తు ఉన్న నగరం వరంగల్ అని తెలిపారు. రాష్ట్రంలోని వరంగల్‌ను ప్రధాన పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను భవిష్యత్తులో తాను తీసుకుంటానని ఆయన చెప్పారు.
వాళ్లే అవినీతిని బయటపెట్టుకుంటున్నరు
రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయిందో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారని కేటీఆర్ అన్నారు. ‘ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్తుంటే.. 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు జరగడం లేదని మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్తున్నారు.
పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు. దేవాలయ భూముల వ్యవహారంపై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కమీషన్ల వసూళ్లలో మునిగిపోయింది’ అని ఆయన దుయ్యబట్టారు.