తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
హనుమకొండ,(విజయక్రాంతి): సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకురాలు రావు పద్మ అన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బిజెపి హనుమకొండ జిల్లా(Hanumakonda District) అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ నీ కలసి మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు రావు పద్మ మాట్లాడుతూ తెలంగాణ వీర చరిత్రను భావితరాలకు అందించాలనే బాధ్యతతో 1998 నుండి బీజేపీ నిరంతరం పోరాడుతోందనీ, ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన నాయకులు, అధికారంలోకి వచ్చాక ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలన్నారు.
అమరుల త్యాగాలను గౌరవిస్తూ సెప్టెంబర్ 17ను వెంటనే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, మహాత్ముల పోరాటాల గడ్డపై స్వేచ్ఛా వాయువులు వీచిన ఈ చారిత్రాత్మక రోజును సముచితంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాలి ప్రసాద రావు, సర్వోత్తమ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత, మధు, ఓం ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.