పాఠశాల భవనం ఆక్రమణపై విద్యాశాఖ అధికారుల స్పందన

16-09-2026 | 12:25am

మహమ్మదాబాద్,(విజయక్రాంతి): మండల పరిధిలోని బొట్లగడ్డ తండా ప్రాథమిక పాఠశాల(Botlagadda Thanda Primary School) భవనం ఆక్రమణ, కూల్చివేత అంశంపై మండల విద్యాధికారి స్పందించారు. పాఠశాల భవనానికి సంబంధించిన విషయాన్ని స్థానిక నంచర్ల హెడ్‌మాస్టర్ సురేందర్ రెడ్డి ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివేదిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై గ్రామ సర్పంచ్, రాంచందర్ నాయక్  పంచాయతీ కార్యదర్శులు పాఠశాల భవనంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

మండల విద్యాధికారి రాజు నాయక్(Mandal Education Officer Raju Nayak) గ్రామస్తుల సమక్షంలో పాఠశాల భవనంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ప్రస్తుతం చేపట్టిన నిర్మాణాలను తొలగించరాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గతంలో పాఠశాల భవనం నిర్మాణం కోసం తమ పట్టా భూమిని ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం తమకు సొంత ఇల్లు లేకపోవడంతో పరిస్థితుల కారణంగా పాఠశాల భవనంలో తలదాచుకున్నామని, ఇకపై పాఠశాల భవనంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోమని గ్రామ సర్పంచ్ సమక్షంలో హామీ ఇచ్చారు.

గ్రామ సర్పంచ్ రాంచందర్ నాయక్  మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు గ్రామంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిగిలిన రెండు తరగతి గదుల భవనాల్లో పాఠశాల నిర్వహణ కొనసాగుతోందని మండల విద్యాధికారికి రాజునాయక్ వివరించారు. అనంతరం మండల విద్యాధికారి గ్రామస్తులతో మాట్లాడి విద్యకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఆముదాలగడ్డ తండా, నంచర్ల ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.

మరిన్ని వార్తలు