బీసీల భూముల జోలికొస్తే ఖబడ్దార్
బీసీ సంఘాల హెచ్చరిక
ముషీరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): బీసీల భూములపై రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమ జోక్యాలను సహించేది లేదని బీసీ సంఘాల నాయకులు(BC Association Leaders) హెచ్చరించారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కొల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, జాతీయ ఉపాధ్యక్షుడు రావులకోల్ నరేష్ ప్రజాపతి మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని సర్వే నంబర్లు 22, 22/ లో దామ అరుణ్ కుమార్కు సంబంధించిన భూమి విషయంలో రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. కోర్టు ఆదేశాలు, పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ ప్రహరీ గోడను ఎఫ్టిఎల్ పరిధిలో ఉందనే కారణంతో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేశారని పేర్కొన్నారు. ఎఫ్టిఎల్ పరిధికి సంబంధించిన అధికారిక మ్యాప్, సర్వే రిపోర్టు, కూల్చివేత ఉత్తర్వులను అధికారులు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
రాజకీయ, పోలీస్ ఒత్తిళ్లపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోతే మున్సిపల్, సంబంధిత అధికారుల కార్యాలయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరలో రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీసీల భూముల పరిరక్షణకు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ కో-చైర్మన్ కాటేపల్లి వీరస్వామి, కన్వీనర్ జాజిల లింగం గౌడ్, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్, పానుగంటి విజయ్ గౌడ్, తారకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






