సంఘ్ పరివార్, గాంధీ పరివార్ మధ్యే పోటీ

26-09-2026 | 05:25am
  1. మతం పేరిట దేశాన్ని విభజిస్తున్న సంఘ్ పరివార్
  2. ఐక్యతకు కృషిచేస్తున్న గాంధీ పరివార్
  3. రాహుల్‌ను ప్రధానిని చేయడమే నా లక్ష్యం: ముఖ్యమంత్రి రేవంత్
  4. కేరళలో ఆర్యదాన్ మొహమ్మద్ పురస్కారం అందుకున్న సీఎం

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): దేశంలో సంఘ్ పరివార్, గాంధీ పరివార్ మధ్యే పోటీ అని.. దేశాన్ని విభజించడమే సంఘ్ పరివార్ విధానమని, ఐక్యంగా ఉంచడానికి గాంధీ పరివార్ కృషిచేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. దేశంలో ఓట్లు, పార్టీలు, గుర్తుల దొంగతనం జరుగుతున్నదని.. యువత భవిష్యత్తును దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఓటు హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ మొహమ్మద్- బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డును సీఎం రేవంత్‌రెడ్డి అందుకున్నారు. కేరళలోని నిలంబూరులో శుక్రవారం జరిగిన వేడుకలో ఆయనకు పురస్కారాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(AICC General Secretary K.C. Venugopal) ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంఘ్ పరివార్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం భారతదే శాన్ని కులం, మతం పేరిట విభజిస్తున్నది. గాంధీ పరివార్ మాత్రం భారత ఐక్యతకు కృషి చేస్తున్నది. రెండు పరివార్‌ల మధ్య పోటీ’ అని తెలిపారు. 

రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం..

కేరళ రాజకీయాలకు దేశ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని సీఎం రేవంత్ అన్నారు. ‘వాతావరణ నిపుణులు రుతుపవనాల కోసం కేరళ వైపు ఎలా చూస్తారో.. దేశ రాజకీయాలను అర్థం చేసుకునే విషయంలోనూ కేరళను ఒక సంకేతంగా చూడవచ్చు. 1991లో కేరళలో కరుణాకరన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పీవీ నరసింహా రావు ప్రధానమంత్రి అయ్యారు.

1996లో కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది.  2001లో ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రి కాగా, 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.  ఇప్పుడు (2026) కేరళలో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధించడంతో కొత్త రాజకీయ గాలి మొదలవుతున్నది’ అని విశ్లేషించారు.

దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగం చేశారని.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అధికారాన్ని, పదవులను త్యజించారని సీఎం తెలిపారు. ఇప్పుడు చరిత్ర పిలుస్తున్నదని, దేశానికి రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘నాకు వ్యక్తిగత రాజకీయ ఆశలు లేవు. 2006లో క్షేత్రస్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను. గత రెండు దశాబ్దాల్లో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడిగా చేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇక నా ముందున్న ఏకైక లక్ష్యం రాహుల్‌గాంధీని భారత ప్రధానమంత్రిగా చూడటమే’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 

ప్రజా సంక్షేమానికి గుర్తింపుగా అవార్డు..

ఐదు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌కు సేవలందించిన ఆర్యదాన్ మహమ్మద్ కేరళ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా.. కేరళ కాంగ్రెస్ నేత, దివంగత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ మొహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది.

అవార్డు కింద రూ. లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, ఇతర సామాజిక వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను గుర్తిస్తూ సీఎం రేవంత్‌రెడ్డిని అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు.

మరిన్ని వార్తలు