మతి తప్పిన మాటలు
- ప్రధాని, హోంమంత్రికి రాహుల్ క్షమాపణ చెప్పాలి
- ‘ఓట్ చోరీ’పై కాంగ్రెస్ నీతులు చెప్పడం విడ్డూరం
- కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ.. ఓడితే విఘాతమా?
- రాజ్యాంగబద్ధ సంస్థలపై ఆ పార్టీ ఆరోపణలు దారుణం: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నట్లుగా, ఆ పార్టీ ఓడిపోయి ఇతర పార్టీలు గెలిస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం అన్నట్లుగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీరు ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) విమర్శించారు. ‘అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిని దేశద్రోహులు అంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించడం ఏమిటి? ఈ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని, అసహనాన్ని తెలియజేస్తున్నాయి.
కాంగ్రెస్ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో రాహుల్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నది’ అని మండిపడ్డారు. నిన్నమొన్నటివరకు సుప్రీంకోర్టు, ఇప్పుడు ఎన్నికల సంఘం, రేపు మరో రాజ్యాంగబద్ధ సంస్థ.. ఇలా అన్నింటిపై ఆరోప ణలు, దాడులు చేయడమే కాంగ్రె స్ పని అని శుక్రవారం ఒక ప్రకటనలో కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. అవినీతిపై ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు విచారణ చేపడితే కూడా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం అంటూ విమర్శిస్తున్నదని ఆయన ఫైర్ అయ్యారు.
దానం సంగతేంది?
ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాల్సిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని.. దానం నాగేందర్‌కు ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిం చారని విమర్శించారు.
ప్రజలు ఒక పార్టీని నమ్మి ఓటు వేసి గెలిపిస్తే.. ఆ తర్వాత ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ప్రజల తీర్పును అపహాస్యం చేయడమేనన్నారు. “ప్రజల తీర్పును ఫిరాయింపుల ద్వారా మా ర్చిన కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ‘ఓట్ చోరీ’ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు” అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘ఓట్ చోరీ’ ఆరోపణలకు ఆధారాలేవీ?
రాహుల్ గాంధీ పదేపదే ‘ఓట్ చోరీ’ అం టూ ఆరోపణలు చేస్తున్నారని, అయితే అం దుకు సంబంధించిన ఆధారాలను ఎందుకు బయటపెట్టడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించా రు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పెద్ద సం ఖ్యలో బూత్ ఏజెంట్లు ఉన్నారని, ఓటర్ల జా బితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఎన్నికల ప్రక్రియలో అవకాశం, సమయం కల్పించారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటే సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు.
‘ఓట్ చోరీ’ జరిగి నట్లు ప్రమాణపూర్వకంగా చెప్పాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేస్తే.. ఆయన మౌనం వహించారని ఆరోపించారు. ఆధారాలు లేకుండా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. ‘ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ‘సర్’ ప్రక్రియను బీజేపీకి అనుకూలంగా రూపొందిం చిన కుట్రగా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నా రు. అయితే ‘సర్’ జరిగిన ప్రాంతాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆ వాదనకు తగ్గట్టు పరిస్థితి లేదు.
‘సర్’ నిర్వహించిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాలే దు.. అదే కేరళలోనూ కాంగ్రెస్ నేతృత్వంలో ని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ‘సర్’ ప్రక్రియ ద్వారా నకిలీ ఓటర్లను తొలగించడం వల్ల తమ పార్టీకి ప్రయోజనం జరి గిందని కేరళకు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మె ల్యే బహిరంగంగా వ్యాఖ్యానించారు’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో సర్ ప్రక్రియలో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొ లగించినట్లు చెప్తున్న 20 నియోజకవర్గాల ఫలితాలను కూడా ప్రస్తావించారు. వాటిలో టీఎంసీ 13 స్థానాల్లో, బీజేపీ ఆరు స్థానాల్లో గెలిచిందని ఆయన అన్నారు. ‘సర్’ అనేది బీజేపీకి అనుకూలమైన కుట్ర అయితే.. ఆ ప్రక్రియ జరిగిన ప్రాంతాల్లో బీజేపీ ఎందుకు మెజారిటీ స్థానాల్లో గెలవలేదని ప్రశ్నించారు.
అప్పుడు లేని అనుమానం ఇప్పుడెందుకు?
‘కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎన్నికల ప్రక్రియపైనా అనుమా నాలు వ్యక్తం చేయాలా?’ అని రాహుల్‌ను కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లు, ఇతర పార్టీలు గెలిస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం జరిగినట్లు చెప్ప డం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఎన్నికల ఫలితాలను గౌరవించడం రాజకీయ పార్టీల బాధ్యత. కాంగ్రెస్ పార్టీ చరిత్రను కూడా రా హుల్ గాంధీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి’ అని ఆయన సూచించారు.
ఎన్నికల సంఘం స్వతంత్రతపై ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎన్నికల సంఘం మాజీ అధికారులకు రాజకీయ పదవులు ఇచ్చారని తెలిపారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంఎస్ గిల్‌ను రాజ్యసభకు కాంగ్రెస్ పంపి అనంతరం కేంద్ర మం త్రిగా నియమించలేదా? అని ప్రశ్నించారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నిక ల్లో అభ్యర్థిగా నిలబెట్టిందని గుర్తుచేశారు. ఇలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి నీతులు చె ప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ అనే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులోనూ జోక్యం చేసుకోబోద ని ఆయన స్పష్టం చేశారు. ‘సుప్రీంకోర్టునూ కాంగ్రెస్ పార్టీ నమ్మడం లేదు.. ఎన్నికల సం ఘంపైనా ఆ పార్టీకి విశ్వాసం లేదు.. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. చివరకు.. దేశాన్ని కాపాడుతున్న సాయుధ బలగాలపై కూడా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాహుల్ గాంధీ జీ!.. ఇంకా మీరు నమ్మేదెవరిని?’ అని కిషన్‌రెడ్డి నిలదీశారు.